బంగాల్ నేర పరిశోధన విభాగం(సీఐడీ) అధికారులు కోల్కత్తాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి పేలుళ్లకు ఉపయోగించే రేడియోధార్మిక పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 4,250 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు.
ఈ రేడియోధార్మిక పదార్థాలను అణుబాంబుల తయారీలో ఉపయోగించే కాలిఫోర్నియా స్టోన్గా అధికార వర్గాలు గుర్తించాయి. వీటిని అమ్మేందుకు వారు సంప్రదించిన వ్యక్తి తమకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. నిందితులను హూగ్లీకి చెందిన అసిత్ ఘోష్, సైలెన్ కర్మాకర్గా గుర్తించారు. వారికి కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి వాటిని అమ్మినట్లు వివరించారు.
అరెస్ట్ అయిన ఇరువురు నగరానికి ఎందుకు వచ్చారు? వారి వద్ద ఆ రేడియో ధార్మిక పదార్థాలు ఎందుకు ఉన్నాయి? విధ్వంసానికి ఏమైనా పథక రచన చేశారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. వీరిపై అటామిక్ ఎనర్జీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు.
ఇదీ చూడండి: గంజాయి సాగుకు అనుమతి కోసం రైతు దరఖాస్తు