నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ తారలు పెద్దగా రాణించలేదు. బంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పలువురు తారలు బరిలోకి దిగారు. వారు ఎవరు? అందులో ఎవరిని విజయం వరించింది, ఎవరిని పరాజయం పలకరించిందనే విషయాలను ఓసారి చూద్దాం.
కమల్ హాసన్- ఓటమి
సినీ రంగంలో తన నటనతో ప్రజలను మంత్రముగ్ధులను చేసిన కమల్ హాసన్.. రాజకీయ జీవితంలో మరోసారి ఎదురుదెబ్బలు తిన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చతికిల పడింది మక్కల్ నీది మయ్యం. పార్టీ అధినేత కమల్ హాసన్ సైతం తన స్థానం నుంచి గెలవలేకపోయారు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన భాజపా అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓటమి పాలయ్యారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పోటీ చేయగా.. అప్పుడూ ఓటమే వెక్కిరించింది. ఇప్పుడు పార్టీ అధినేతగా స్వయంగా రంగంలోకి దిగినా లాభం లేకుండా పోయింది.
ఖుష్బూ సుందర్- ఓటమి
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఖుష్బూ సుందర్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. ఇటీవల భాజపాలో చేరిన ఖుష్బూ.. చెన్నైలోని థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. డీఎంకే నేత ఎళిలాన్పై ఓడిపోయారు.
సురేష్ గోపి- ఓటమి
కేరళ అసెంబ్లీ బరిలో నిలిచిన ప్రముఖ నటుడు సురేశ్ గోపిని సైతం ఓటమే పలకరించింది. త్రిస్సూర్ నుంచి భాజపా తరపున ఆయన పోటీ చేశారు. సీపీఐ అభ్యర్థి బాలచంద్రన్ ఇక్కడ గెలుపొందగా.. సురేశ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
బాబుల్ సుప్రియో- ఓటమి
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోను బంగాల్ అసెంబ్లీ బరిలోకి దించినప్పటికీ ఫలితం కాషాయ పార్టీకి అనుకూలంగా రాలేదు. టోలీగంజ్ నుంచి బాబుల్ పోటీ పడగా.. టీఎంసీ నేత అరూప్ బిశ్వాస్ చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బాబుల్ సుప్రియో ప్రముఖ సినీ గాయకుడు కావడం గమనార్హం.
లాకెట్ ఛటర్జీ- ఓటమి
చుంచురా స్థానం నుంచి బరిలోకి దిగిన.. బంగాలీ నటి, భాజపా ఎంపీ లాకెట్ ఛటర్జీ ఓడిపోయారు. టీఎంసీ అభ్యర్థి అసిత్ మజుందార్‌పై 18 వేల ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు.
ఉదయనిధి స్టాలిన్- గెలుపు
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. తన తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి సునాయాస విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 69 వేలకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తమిళ సినిమాల్లో నటుడిగా అలరించారు ఉదయనిధి స్టాలిన్. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్‌గాను పనిచేశారు.
శయంతికా బెనర్జీ- ఓటమి
బంకురా నియోజకవర్గం నుంచి టీఎంసీ తరపున పోటీ చేసిన శయంతికా బెనర్జీ.. పరాజయం మూటగట్టుకున్నారు. బెంగాలీలో పలు సినిమాల్లో ఆమె నటించారు. ఎన్నికలకు ముందు టీఎంసీలో చేరారు. భాజపా అభ్యర్థి నీలాద్రి శేఖర్ దానాపై శయంతిక సుమారు 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కౌశనీ ముఖర్జీ- ఓటమి
బంగాల్ నటి, టీఎంసీ నేత కౌశనీ ముఖర్జీ సైతం పరాజయ బాటలోనే పయనించారు. ఉత్తర కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి ముకుల్ రాయ్‌పై పోటీ చేశారు. 35 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి మూటగట్టుకున్నారు.
ఇదీ చదవండి: టీఎంసీకి షాక్- నందిగ్రామ్‌లో మమత ఓటమి