దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన 80 కోట్లమందికి టీకా అందించడానికి ఎంత కాలం పడుతుంది? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి మదిని తొలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 ఏళ్లు దాటినవారు 60%మంది ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర వైద్యారోగ్యశాఖ పరిగణనలోకి తీసుకున్న లెక్క ప్రకారం (దేశ జనాభా 135,69,78,000) 81.41 కోట్ల మందికి టీకా ఇవ్వాల్సి ఉంటుంది.
భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం ఇప్పటివరకు నెలకు కోటి డోసులు ఉండగా, మే, జూన్ నాటికి రెండు కోట్లు, జులై-ఆగస్టు నాటికి 6-7, సెప్టెంబర్ నాటికి 10 కోట్ల డోసులకు చేరుతుందని అంచనా. సీరం ఇన్‌స్టిట్యూట్ కొవిషీల్డ్ ఉత్పత్తి జులై నాటికి 10 కోట్ల డోసులకు చేరనుంది.
ఈ జనాభా ప్రకారం టీకా కార్యక్రమం ప్రారంభమైన జనవరి 16 నుంచి ఇప్పటివరకు 15.78% మందికి మొదటి డోసు, 3.53% మందికి రెండో డోసు దొరికింది. ఇప్పటివరకు కొవిన్ యాప్‌లో నమోదు చేసుకున్న 17.63 కోట్ల మందిలో 72.70% మందికి మొదటి, 16.33% మందికి రెండో డోసు దక్కినట్లు లెక్క.
- టీకా కార్యక్రమం ప్రారంభమైన రోజు నుంచి రోజుకు సగటున 16.32 లక్షల మంది పేర్లు నమోదుచేసుకోగా, ఇప్పటివరకు సగటున 14.54 లక్షల డోసుల టీకా వేశారు. ఇందులో 90% కొవిషీల్డ్ కాగా, 10% కొవాగ్జిన్ ఉంది.
- మే1 నుంచి మూడోదశ వ్యాక్సిన్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానాన్ని అనుసరించి కేంద్రం ఈ నెల 15వ తేదీవరకు అన్ని రాష్ట్రాలకూ కలిపి 2.12 కోట్ల డోసులు కేటాయించింది. అంటే ప్రభుత్వ టీకా కేంద్రాల్లో రోజుకు 14,13,333 డోసులు మాత్రమే ఇవ్వడానికి వీలవుతుంది. ఇప్పటివరకు వేసిన సగటు టీకా డోసుల సంఖ్య కంటే ఇది తక్కువ.
- ప్రస్తుతం దేశీయంగా వ్యాక్సిన్ తయారుచేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్‌లకు కేంద్ర ప్రభుత్వం వచ్చే మూడునెలల కాలానికి కలిపి 16 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం నెలకు 5.33 కోట్ల డోసులు వచ్చే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి ఆ సంస్థలు మరో 50% మొత్తాన్ని రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకోవడానికి వీలున్నందున మరో 16 కోట్ల డోసులను రాష్ట్రాలు, ఆసుపత్రులకు ఇవ్వొచ్చు. అంటే కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు కలిపి మూడునెలల్లో 32 కోట్ల డోసులు వేయవచ్చు. ఈ లెక్కన రోజుకు 35 లక్షలకుపైగా డోసుల చొప్పున నెలకు 10.66 కోట్ల మందికి ఇవ్వొచ్చు.
- ఈ ప్రణాళిక ప్రకారం టీకా కార్యక్రమం కొనసాగితే 80 కోట్లమందికి ఒక డోసు వ్యాక్సిన్ ఇవ్వడానికి దాదాపు 8 నెలలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. రెండు డోసులు ఇవ్వడానికి అంతకు రెట్టింపు సమయం కావాల్సి వస్తుంది.
- ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రూ.5,895.75 కోట్లతో సీరం, భారత్ బయోటెక్‌లకు కలిపి 34.6 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. ఈ మొత్తంతో అర్హులైన జనాభాలో 42.49% మందికి ఒక డోసు ఇవ్వడానికి వీలవుతుంది.
- ఆగస్టు నుంచి గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా, హైదరాబాద్‌కు చెందిన బయలాజికల్-ఈ వంటి వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అంచనా.
- విదేశీ టీకాలకు కేంద్రం అనుమతి ఇచ్చినా అవి ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయ్యే అవకాశం లేదు. అందువల్ల అవి వేన్నీళ్లకు చన్నీళ్లలా మాత్రమే తోడవుతాయని నిపుణులు చెబుతున్నారు.
- కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించిన విధానం ప్రకారం ఒక్కోడోసు రూ.157కి కొనుగోలుచేసి ఉంటే 81.41 కోట్ల మందికి రెండు డోసులు ఇవ్వడానికి రూ.25,564 కోట్లు అయ్యేది. ఇప్పుడు కేంద్రం 50% మాత్రమే సరపరా చేయనున్నందున దాని వ్యయం రూ.12,782 కోట్లకే పరిమితం కానుంది. మిగిలిన 50% మొత్తంలో 25% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలన్నా ఒక్కోడోసుకు సగటున రూ.350 చొప్పున (సీరం రూ.300, భారత్‌బయోటెక్ రూ.400) రూ.14,246 కోట్లు ఖర్చుపెట్టాల్సి వస్తుంది. మిగిలిన 25% ప్రజలు సొంతంగా వేయించుకోవాలంటే సగటున రూ.900 చొప్పున (సీరం రూ.600, భారత్‌బయోటెక్ రూ.1200) రూ.36,634 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ మూడూ కలిపితే మొత్తం టీకా ఖర్చు రూ.63,662 కోట్లకు చేరుతుంది.
- ఏప్రిల్ తొలి వారంతో పోల్చితే చివరికల్లా టీకాల కార్యక్రమం వేగం తగ్గింది. ఏప్రిల్ 5న 45.39లక్షల డోసుల టీకా వేయగా, మే 3వ తేదీనాటికి అది 16.97 లక్షల డోసులకు పడిపోయింది. టీకా ఉత్పత్తి అనుకున్నంత స్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణం.
ఇదీ చదవండి: లండన్‌లో జైశంకర్ వరుస సమావేశాలు