Honor Killing In Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో జంట పరువు హత్యలు.. సంచలనం సృష్టిస్తున్నాయి. మొరెనా జిల్లా రతన్‌బసాయి గ్రామానికి చెందిన శివానీ తోమర్.. పొరుగు గ్రామం బలుపురాలో నివసించే రాధేశ్యామ్ తోమర్ గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా వీరి ప్రేమ కొనసాగడం వల్ల ఆగ్రహంతో ఊగిపోయిన శివానీ కుటుంబ సభ్యులు వారిద్దరినీ దారుణంగా హత్య చేశారు. జూన్ మూడో తేదీనే వీరిని కాల్చి చంపిన యువతి కుటుంబ సభ్యులు.. వారి మృతదేహాలకు భారీ బండరాళ్లు కట్టి చంబల్ లోయలోని మొసళ్లతో నిండిన నదిలో విసిరేశారని పోలీసులు తెలిపారు.
తన కుమారుడు కనపడడం లేదని.. యువతి కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని రాధేశ్యామ్ తోమర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ గ్రామం నుంచి పారిపోయి ఉంటారని పోలీసులు తొలుత భావించినా దానికి ఆధారాలు లభించలేదు. తర్వాత యువతి తండ్రి, బంధువులను విచారించగా.. ఈ హత్యలు చేసినట్లు వారు అంగీకరించారని పోలీసులు తెలిపారు. విచారణలో ఈ జంట హత్యలు జరిగి 15 రోజులైనట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాలను పడేసిన ప్రాంతాన్ని యువతి తండ్రి రాజ్‌పాల్ పోలీసులకు వెల్లడించాడు.
జూన్ 3న శివానీ కనిపించడం లేదని ఆమె తండ్రి ఫిర్యాదు చేయగా.. జూన్ 4న రాధేశ్యామ్ తండ్రి అంబాహ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గతంలో మే నెలలో వీరిద్దరూ ఇళ్ల నుంచి పారిపోయారు. వీరిని ఉత్తర్‌ప్రదేశ్‌లో గుర్తించిన పోలీసులు.. తిరిగి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సారి కూడా పారిపోవచ్చని తోమర్ కుటుంబ సభ్యులు భావించారు. అయితే శివానీ, రాధేశ్యామ్‌లు హత్యకు గురయ్యారు. వారి మృతదేహాల కోసం చంబల్ నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
పరువు కోసం కుమార్తెపై పగ.. దారుణంగా చంపి ఆనవాళ్లు లేకుండా చేసి..
ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర.. నాందేడ్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ఓ యువకుడిని ప్రేమిస్తుందనే కారణంతో కన్న కుమార్తెనే చంపాడు ఓ తండ్రి. హత్య విషయం బయట పడకుండా సాక్ష్యాలనూ ధ్వంసం చేశాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు సహకరించిన వారితో పాటు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది.. నాందేడ్ జిల్లాలోని పింప్రి మహిపాల్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల శుభంగి బీఏఎంఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన తరుణ్ అనే యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ ప్రేమ వ్యవహారాన్ని శుభంగి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. తరుణ్‌ను మర్చిపోవాలని ఆమెను పలు మార్లు మందలించారు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో మూడు నెలల క్రితమే శుభంగికి మరొక యువకుడితో పెళ్లిని నిశ్చయించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.