Hometown Of Teachers Inchal in Karnataka : ఒకప్పుడు అది విద్యావంతులే లేని గ్రామం.. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ ఉపాధ్యాయుడు దర్శనమిస్తారు! ఓ స్వామీజీ తీసుకున్న నిర్ణయంతో అక్కడ అనూహ్య మార్పులు వచ్చాయి. టీచర్లకు కేరాఫ్‌గా ఆ గ్రామం మారిపోయింది. రాష్ట్రంలోనే ఎక్కువ మంది టీచర్లు ఉన్న గ్రామంగా రికార్డుకెక్కింది. టీచర్స్ డే సందర్భంగా ఆ గ్రామం విశేషాలు మీకోసం.
Inchal Teachers Training College : కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని సావదత్తి తాలుకాలోని ఇంచాల్ ప్రతి అంగుళానికీ ఓ టీచర్ కనిపిస్తారని చెబుతుంటారు. ఈ గ్రామానికి చెందిన 500 మందికి పైగా టీచర్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. గ్రామం నుంచి ఇంత మంది ఉపాధ్యాయులు వెలుగులోకి రావడానికి సిద్ధసంస్థాన్ మఠానికి చెందిన డాక్టర్ శివానంద భారతి స్వామీజీ కారణంగా చెబుతుంటారు.
వేల మంది టీచర్లు.. రాష్ట్రవ్యాప్తంగా సేవలు
కేఎల్ఈ విద్యాసంస్థకు చెందిన టీసీహెచ్(టీచర్స్ సర్టిఫికెట్ హయ్యర్) కళాశాల 1983-84లో బెళగావిలో ఓ క్యాంప్ నిర్వహించింది. ఈ క్యాంప్‌ను స్ఫూర్తిగా తీసుకున్న శివానంద స్వామీజీ.. బెళగావిలో 1986లో టీసీహెచ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఉచిత అడ్మిషన్లు కల్పించడం వల్ల ఈ కోర్సు చదివేందుకు గ్రామంలోని యువతీయువకులు ఆసక్తి చూపించారు. ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వారు రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో స్థిరపడుతూ వచ్చారు. 1988 నుంచి జరిగిన రిక్రూట్మెంట్లలో ఏటా సగటున 20 మంది టీచర్లు ఈ గ్రామం నుంచే ఎంపికవుతున్నారు. మొత్తంగా 7వేల మంది ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకోగా.. అందులో 99 శాతం మంది టీచర్లు రాష్ట్రంలోని వివిధ స్కూళ్లలో పాఠాలు చెబుతున్నారు.
బడికి వెళ్లాలంటే కొండలు ఎక్కాల్సిందే.. చదువు కోసం పిల్లల సాహసం
జవాన్లు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు సైతం..
1997 రిక్రూట్మెంట్లో కరిగరా అనే కుటుంబం నుంచి ఏకంగా ఏడుగురు ఎంపికయ్యారు. ఆ ఏడాది ఈ ఒక్క గ్రామం నుంచే 50 మంది టీచర్లు ఎంపికయ్యారు. ఇప్పటికీ ఇది రికార్డే. కరిగరా కుటుంబంలో 15 మంది టీచర్లు ఉండగా.. గణగి, రాయా నాయకరా, మిర్జన్నవార్, బద్లి, జంబగి వంటి ఇతర కుటుంబాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్నారు. టీచర్లే కాకుండా ఈ గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో జవాన్లు కూడా దేశసేవలో నిమగ్నమయ్యారు. ఇంచాల్ గ్రామానికి చెందిన 350 మంది సైన్యంలో చేరారు. వివిధ హోదాల్లో వీరు పని చేస్తున్నారు. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులకు ఎంపికైనవారూ ఉన్నారు. గ్రామానికి చెందిన ఐదుగురు కేఏఎస్లుగా పని చేస్తున్నారు.
108 ఏళ్ల ఏజ్‌లో తొలిసారి సంతకం.. 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' కమల!
"శివానంద భారతి స్వామీజి గ్రామంలో విద్యా విప్లవం తీసుకొచ్చారు. ప్రాథమిక స్కూళ్ల నుంచి ఆయుర్వేద మహావిద్యాలయం వరకు అనేక విద్యా సంస్థలను నెలకొల్పారు. ఇంచాల్ గ్రామం రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా పేరు సంపాదించింది."
-ఎస్ఎం బద్లి, విశ్రాంత లెక్చరర్
"శివానంద స్వామీజి రాకముందు గ్రామంలో సెకండరీ విద్య పూర్తి చేసినవారు చాలా తక్కువ. కాలేజీకి వెళ్లినవారు అసలే లేరు. పైచదువుల మాట చెప్పాల్సిన అవసరం లేదు. విద్య విషయంలో ఇంచాల్ గ్రామం బాగా వెనకబడేది. అలాంటి గ్రామాన్ని స్వామీజీ పూర్తిగా మార్చేశారు. టీచర్ల గ్రామంగా తీర్చిదిద్దారు. ఇది మాకు గర్వకారణం."
-సోమలింగ శివప్ప మేటగట్టి, విశ్రాంత హెడ్మాస్టర్
1975లో శ్రీ శివానంద భారతి ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి.. విద్య కోసం కృషి చేశారు స్వామీజి. బెళగావి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు విద్యను చేరువ చేసేందుకు ఆయన పాటుపడ్డారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా నైపుణ్యశిక్షణ ఇప్పించారు. పీజీతో పాటు వైద్య విద్యను సైతం సొసైటీ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. స్వామీజీ సంస్కృతంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఇటీవల పీహెచ్డీ పట్టా సైతం అందుకున్నారు.