అంతర్గత లుకలుకలతో సొంతంగా కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో హిమాచల్‌ప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తపనపడుతోంది. ధరల భారం, నిరుద్యోగం వంటి సమస్యల వల్ల భాజపా సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత గూడుకట్టుకుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం వీరభద్రసింగ్‌కు రాష్ట్రంపై ఉన్న పట్టు తమను అధికార పీఠానికి చేరువ చేస్తుందని కాంగ్రెస్ విశ్వాసం.
ఇటీవలి కాలంలో హస్తం పార్టీ నేతల్లో పలువురు ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్లారు. యువతకు ప్రాధాన్యమిచ్చే ఉద్దేశంతో వీరభద్రసింగ్ తనయుడు విక్రమాదిత్యకు, మరో మంత్రి కుమారుడికి టికెట్లు ఇచ్చినా పలువురు ఇతర యువజన నేతలకు అవకాశం దక్కలేదు. నవంబరు 12న హిమాచల్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వీరభద్రసింగ్ భార్య ప్రతిభాసింగ్ ఈసారి పార్టీ తరఫున ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈసారి త్రిముఖం..
హిమాచల్‌లో సాధారణంగా కాంగ్రెస్, భాజపా మధ్య పోరు సాగుతుంటుంది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలో దిగడంతో పోటీ త్రిముఖం కానుంది. ఈ పరిస్థితుల్లో భాజపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. పాత పింఛన్ విధానం పునరుద్ధరణ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు రూ.1,500 చొప్పున చెల్లింపు, పొరుగుసేవల ప్రాతిపదికన పనిచేస్తున్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు వంటి అంశాలను కాంగ్రెస్ తన ఎన్నికల హామీల్లో చేర్చింది. ఒకసారి భాజపాను, తర్వాత కాంగ్రెస్‌ను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తున్నందున ఆ ప్రకారం చూసినా ఈసారి తమదే అధికారమని హస్తం పార్టీ భావిస్తోంది. 2017 ఎన్నికల్లో 68 స్థానాలకు గానూ భాజపా 44, కాంగ్రెస్ 21 దక్కించుకున్నాయి.
ఇవీ చదవండి: హిమ సీమలో ఎన్నికల వేడి.. కమలం నిలుస్తుందా?.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా!
'సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్'కు ప్రేరణ శ్రీరాముడే'.. అయోధ్యలో ఘనంగా దీపోత్సవం