హిమాచల్‌ప్రదేశ్‌లో ఇద్దరు అధికారుల మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగింది. భుంతర్ విమానాశ్రయం వద్ద.. కులు జిల్లా ఎస్పీ గౌరవ్ సింగ్, ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సెక్యూరిటీ ఆఫీసర్ మధ్య వివాదం తీవ్రమైంది. ఈ క్రమంలో సెక్యూరిటీ అధికారిని చెంపదెబ్బ కొట్టారు కులు ఎస్పీ.
దీనిపై ఆగ్రహించిన సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ గౌరవ్ సింగ్‌పై తిరిగి చేయి చేసుకున్నారు. అయితే.. సమీపంలో ఉన్న పోలీసులు అధికారులు వెంటనే పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
గడ్కరీ కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆహ్వానం పలికేందుకు భుంతర్ విమానాశ్రయానికి వెళ్లారు జైరాం ఠాకూర్. అయితే.. గడ్కరీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన వెంటనే కిసాన్ సంఘ్‌కు చెందిన కొందరు రైతులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులతో ముఖ్యమంత్రి ఠాకూర్, గడ్కరీ రైతులతో మట్లాడారు.
తమ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న ఫోర్ లేన్ రోడ్డు కోసం ప్రభుత్వం కొందరు రైతులకు పరిహారం ఇస్తోంది. అయితే.. ఈ పరిహారాన్ని మరింత పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని గడ్కరీ.. ముఖ్యమంత్రికి తెలిపారు.