Hijab-saffron row: కర్ణాటకలో హిజాబ్ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శివమొగ్గలోని ప్రభుత్వ డిగ్రీ కళాళాల వద్ద ఆందోళనకు దిగిన ఇరు వర్గాల విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ కూడా పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లారు. కాషాయ శాలువాలు ధరించి వచ్చిన విద్యార్థులను కాలేజ్లోకి అనుమతించకపోవడం వల్ల వారు బయట నిరనసన చేపట్టారని, అనంతరం మరో వర్గం విద్యార్థులు అక్కడకు రావడం హింసకు దారితీసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు విజయపురలోనూ హిజాబ్ వివాదం ముదరుతోంది. క్లాస్లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ శాంతేశ్వర ప్రీ యూనివర్సిటీ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. అయితే సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతరం క్లాసులు సస్పెండ్ చేసి సెలవు ప్రకటించింది యాజమాన్యం.
హిజాబ్ వివాదం కర్ణాటకవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చారు. శాంతియుతంగా వ్యవహరించాలని, పోలీసులను ఉపయోగించే పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు.
మూడు రోజులు బంద్
పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని హైస్కూళ్లు, కళాశాలల్ని మూడు రోజులు మూసేయాలని ఆదేశించారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.
ఇవీ చూడండి: హిజాబ్ ధరించిన విద్యార్థులకు అనుమతి.. కానీ స్పెషల్ క్లాస్లో...