hijab ban supreme court: విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు స్వీకరించింది. హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
hijab SC hearing
వ్యాజ్యాలపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కోరారు. త్వరలో పరీక్షలు ఉన్న నేపథ్యంలో.. సత్వరమే విచారణ జరపాలని అభ్యర్థించారు. అయితే, సీజేఐ ధర్మాసనం అందుకు నిరాకరించింది. సెలవుల తర్వాతే కేసును విచారణకు స్వీకరిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. దీనిపై తమకు కొంత సమయం కావాలని వ్యాఖ్యానించారు.
ఇస్లాం మతంలో.. హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారమేమీ కాదని కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. పాఠశాలల్లో హిజాబ్ ధరించవద్దంటూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. ప్రభుత్వ ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలన్న నిబంధన సహేతుకమేనని.. విద్యార్థులు దీనికి అభ్యంతరం చెప్పకూడదని పేర్కొంది. అయితే, ఈ తీర్పుపై మంగళవారమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు కొందరు విద్యార్థినులు.
నో ఎంట్రీ...
ఇక, హైకోర్టు తీర్పు నేపథ్యంలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను విద్యాసంస్థల్లోకి అనుమతించడం లేదు. శివమొగ్గలోని కమలా నెహ్రూ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థినులు బుధవారం బుర్ఖాలు ధరించి రాగా.. అధ్యాపకులు అడ్డుకున్నారు. దీంతో తరగతులకు హాజరుకాకుండానే విద్యార్థినులు వెనుదిరిగారు.
ఒకే ర్యాంకు ఒకే పింఛన్
SC OROP verdict: మరోవైపు, సాయుధ దళాలకు అందించే 'ఒకే ర్యాంకు- ఒకే పింఛన్' విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓఆర్ఓపీ అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొంది. ఓఆర్ఓపీకి సంబంధించి ఐదేళ్లకోసారి పెన్షన్ సవరించే తేదీని 2019 జులై 1 నుంచి పరిగణించాలని ఆదేశించింది. బకాయిలు ఉంటే మూడు నెలల్లో చెల్లించాలని స్పష్టం చేసింది.
ఐదేళ్లకోసారి కాకుండా వార్షికంగా పెన్షన్‌ను సవరించాలని మాజీ సైనికుల అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భగత్ సింగ్ కోశ్యారీ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరింది. అయితే, తాజా తీర్పులో సుప్రీం వీటిని తోసిపుచ్చింది.
లఖింపుర్ కేసు
లఖింపుర్ హింస కేసులో ప్రధాన నిందితుడు ఆశిశ్ మిశ్రాకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సాక్షులపై దాడులు జరుగుతున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వారికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చదవండి: హైకమాండ్ ఆర్డర్.. పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా