బంగాల్ మొదటి దశలో నమోదైన అత్యధిక పోలింగ్ శాతం మార్పునకు సంకేతమని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. తృణమూల్ అవినీతి పాలనపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని తెలిపారు. ధనేకళి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రక్రియకు టీఎంసీ గూండాలు అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తోన్న ఈసీ కృషి ప్రశంసనీయం.
-జేపీ నడ్డా
రాష్ట్రంలో శాంతియుతంగా ఎన్నికలు జరుగుతున్నందుకు మమత ఆందోళన చెందుతున్నారని జేపీ నడ్డా విమర్శించారు. "టీఎంసీ గూండాలకు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు" అని ఎద్దేవా చేశారు. ఓటింగ్ పట్ల ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని.. ఆట ముగిసిందని ('ఖేలా శేష్ హోయే గ్యాచే') వ్యాఖ్యానించారు. భాజపా కార్యకర్త తల్లి 82 ఏళ్ల శోభ మజుందార్ మృతిని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు.
వారిపై చర్యలు: మమత
ఎన్నికలు ముగిసిన వెంటనే నందిగ్రామ్‌లో కారులో తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ మేరకు దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అన్నీ ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం వారిపై చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కోడ్ అడ్డుగా ఉందని తెలిపారు.
నాపై దాడి చేయడానికి వారికి ఎంత ధైర్యం? నందిగ్రామ్ ఘటనలో కారుపై గూండాలు దాడి చేసినప్పటి దృశ్యాలు నా దగ్గర ఉన్నాయి. బంగాల్‌లో ఎన్నికలు ఉన్నందునే నిశ్శబ్దంగా ఉన్నాను. అవి ముగియగానే వారిపై చర్య తీసుకుంటాను.
-మమతా బెనర్జీ
'అమీ దేఖ్ బో కోటో' అనే బంగాలీ సామెతను ఉటంకిస్తూ.. ఎవరు ఏంటి అనేది వారు త్వరలోనే తెలుసుకుంటారని మమత తెలిపారు. మహిళనైన తనను ఒంటరిగా ఎదుర్కోలేక భాజపా, సీపీఎం కలసిపోయాయని.. భాజపాకు స్వతహాగా బలం లేదని మమత విమర్శించారు.
దేశద్రోహులకు ఆశ్రయం ఇస్తున్నవారెవరో నాకు తెలుసు. వారు ఎక్కడికి వెళ్తారు? దిల్లీ, బిహార్, రాజస్థాన్, యూపీలో ఎక్కడ దాక్కున్నా బంగాల్‌కు రప్పిస్తా.
-మమతా బెనర్జీ
ఇవీ చదవండి: నందిగ్రామ్ రణం: నాడు వద్దన్నదే.. నేడు ముద్దు!