HEC Ranchi Salary Issue : సూర్యుడి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన ఆదిత్య-ఎల్1 విజయవంతంగా నింగిలోకి దూసుకుకెళ్లింది. వ్యోమనౌక లక్ష్యం దిశగా పయనిస్తోంది. అయితే ఈ విజయంపై దేశవ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. కానీ ఈ ప్రాజెక్టు కోసం లాంచ్ ప్యాడ్ తయారు చేసిన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్(హెచ్ఈసీ) ఉద్యోగులు మాత్రం 20 నెలలు జీతం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. తమకు జీతాలు సక్రమంగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఝార్ఖండ్.. రాంచీలోని హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్.. ఆదిత్య-ఎల్1 మిషన్ కోసం లాంచ్ ప్యాడ్ తయారు చేసింది. దీని తయారీ కోసం ఇంజినీర్లు, టెక్నీషియన్లు చాలా శ్రమించారని ఉద్యోగులు అంటున్నారు. చంద్రయాన్-3 కోసం కూడా పరికరాలు తయారు చేసినట్లు చెప్పారు. ఆదిత్య-ఎల్1 విజయం పట్ల హెచ్ఈసీ కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇది దేశానికి గర్వకారణమన్నారు. అయితే జీతాలు లేక తమ ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు సరిగ్గా ఇస్తే.. దేశానికి ఉపయోగపడే పరికరాలు మరిన్ని తయారుచేస్తామని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఇస్రో అధికారులు హెచ్ఈసీని సందర్శించి.. సంస్థ ఇంజినీర్లను ప్రశంసించారని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం హెచ్ఈసీ ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్ గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ భవిష్యత్ గురించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. తామంతా ప్రధాని వద్దకు వెళ్లి తమ సమస్యలు చెబుతామని హెచ్ఈసీ ఉద్యోగులు హెచ్చరించారు.
Aditya L1 Mission Successful Launch : కాగా, ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 విజయవంతంగా సూర్యుడి దిశగా దూసుకెళ్తోంది. తొలుత ఆదిత్య ఎల్-1ను భూమధ్యంతర కక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకునేందుకు దీనికి 125 రోజుల సమయం పట్టనుంది. ఆదిత్య-ఎల్ 1 వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను (Aditya L1 Payloads) మోసుకెళుతోంది. ఇందులో 'విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ "లోఎనర్జీ" ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్‌లు ఉన్నాయి.
సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా 4 పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.
Aditya L1 Mission : 'అంతరిక్ష రంగంలో భారత్ పాత్ర పెరుగుతోంది'.. 'ఆదిత్య' విజయం కోసం హోమాలు, పూజలు