మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వర్షాలకు ముంబయి సహా పరిసర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ముంబయిలో ఎక్కడికక్కడ నీరు నిలిచి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
పలు ప్రాంతాల్లో లోకల్ రైళ్లను సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌వే, గాంధీనగర్, వాడలా వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కింగ్ సర్కిల్‌లోని రైల‌్వే వంతెన వద్ద భారీ కంటెయినర్ నిలిచిపోగా.. పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వర్షాల కారణంగా ఇప్పటివరకు పలు ఘటనల్లో 33 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ముంబయితో పాటు పరిసర జిల్లాల్లోనూ వాన బీభత్సం కొనసాగుతుంది. ఠాణెలోని భివండీ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. దుకాణ సముదాయాల్లోకి పెద్దఎత్తున నీరు ప్రవేశించింది.
పాల్ఘర్, నాసిక్ జిల్లాల్లో వరదలు.. నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ముంబయిలో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ).. ప్రజలకు సూచించింది.
ఇదీ చూడండి: వరుణుడి బీభత్సానికి మహా నగరాలు గజగజ
ఇదీ చూడండి: ముంచెత్తిన వరదలు- స్తంభించిన జనజీవనం