Nizamabad District Rains : నిజామాబాద్ జిల్లాలో కుండపోత వాన కురిసింది. కేవలం ఆరు గంటల్లోనే... అల్లకల్లోలం సృష్టించింది. నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమై ఏకధాటిగా తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు అతి భారీవర్షం కురిసింది. వేల్పూర్‌లో ఏకంగా 46.3 సెంటీమీటర్ల రికార్డు స్థాయి... వర్షపాతం నమోదైంది. ఆర్మూర్ మండలం పెర్కిట్ లో 33.1, భీంగల్ లో 26.4, కమ్మర్‌పల్లి మండలం కోనసముందర్‌లో 22.6, జక్రాన్‌పల్లిలో 22.2, డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లిలో 17.2, మోర్తాడ్‌లో 11.2, ధర్పల్లిలో 9.7, ఆలూర్‌లో 8.7, ఆలూర్ మండలం మచ్చెర్లలో 8.3, నిజామాబాద్ నార్త్ మండలం గూపన్‌పల్లిలో 8.2, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో 8 సెం.మీ.ల వర్షాపాతం నమోదైంది.
Heavy Rains in Nizamabad : నిజామాబాద్ జిల్లాలో వర్షంబీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్‌లో... తీవ్ర ప్రభావం చూపింది. 7 చెరువులకు గండ్లుపడగా, 6 చోట్ల ఆర్అండ్‌బీరోడ్లు, 14 పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. పలుగ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద, చెరువులు తెగిపోవటంతో వేలాదిఎకరాల్లో పంటపొలాలు నీట మునగటంతో పాటు ఇసుక మేటలేశాయి. వేల్పూర్‌లో సోమవారం అర్ధరాత్రి వేళ వరద నీరు ఇళ్లలోకి చేరటంతో ప్రజలను పంచాయతీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక మదర్సాలోని 40 మంది పిల్లలను... సమీపంలోని షాదీఖానాలోకి తరలించారు. పలుచోట్ల 43 పాత ఇళ్లు... పాక్షికంగా దెబ్బతిన్నాయి. లోలెవల్ వంతెనలు, జాతీయ రహదారులపై వరదనీరు పారుతోంది.
Heavy Rainfall at Velpur in Nizamabad : వేల్పూర్ మీద వర్షం పెను ప్రభావం చూపింది. మర్సకుంట చెరువు తెగి... గ్రామానికి వచ్చే రోడ్డుపై పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీస్‌స్టేషన్, తహశీల్దార్, ఐకేపీ భవనం, రైతు వేదిక, గ్రామాభివృద్ధికమిటీ భవనాల చుట్టూ నీళ్లు చేరాయి. ఇలాంటి వర్షం ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాల వల్ల వేల్పూరులోని మర్సకుంట చెరువు, కాడి చెరువులతో పాటు పచ్చలనడకుడ, జానకంపేట, పడగల్ నవాబ్ చెరువు కట్టలు... తెగిపోయాయి. పచ్చలనడకుడ చెరువు తెగి వరద ప్రవాహానికి ఆర్అండ్‌బీ రోడ్డు ఐదడుగుల లోతుతో కోతకు గురైంది. పడగల్ చెరువు తెగటంతో రోడ్డు దెబ్బతింది. వెంకటాపూర్- కోసమనపల్లి రోడ్డు.. కొట్టుకుపోయింది. అంకాపూర్ పోచంపల్లి మధ్యలో మత్తడి వాగు ఉద్ధృతికి... రహదారి కోతకు గురైంది.
భారీ వర్షంతో కొట్టుకుపోయిన రోడ్లు.. నిలిచిపోయిన రాకపోకలు : ఆర్మూర్ మండలం చేపూరు- వేల్పూర్ మండలం అక్కోర గ్రామాల మధ్య... జాతీయ రహదారి-63 కోతకు గురైంది. ఆర్మూర్లోని పెర్కిట్ వద్ద... రహదారి దెబ్బతింది. స్థానిక రైల్వేస్టేషనుకు వెళ్లే ఆప్రోచ్ సిమెంట్ రోడ్డు కొట్టుకుపోయింది. ఆర్మూర్ మండలం మంథని-పిప్రి మధ్యలో ఆర్అండ్ బీ రోడ్డు కొట్టుకుపోయి.. రాకపోకలు నిలిచిపోయాయి. జక్రాన్‌పల్లి మండలంలో తొర్లికొండ-మనోహరాబాద్ గ్రామాల మధ్య పంచాయతీరాజ్ రోడ్డు తెగింది. పడకల్ పెద్ద చెరువుకు గత వర్షాల్లో గండిపడగా... మరమ్మతులు చేశారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన వేల్పూర్‌ను... మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్, డివిజన్ కార్యాలయాల్లో... కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని ప్రజలు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని సూచించారు.
'వర్షాలతో అనేక చోట్ల చెరువులు తెగి రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 9 చెరువుల కట్టలు తెగిపోయాయని.... 14 రోడ్లు ధ్వంసమయ్యాయి. వాటిని మరమ్మతు చేసే పనిలో అధికారుల నిమగ్నమయ్యారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సుమారుగా 5వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎక్కువస్థాయిలో ఆస్తి నష్టం జరగలేదు. ప్రాణనష్టాన్ని ముందస్తుజాగ్రత్తలతో అరికట్టాం. ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తాను.' - మంత్రి ప్రశాంత్‌రె డ్డి
జలకళ సంతరించుకున్న చెరువులు, వాగులు : భారీవర్షాలతో చెరువులకు జలకళ సంతరించుకొంది. వారం కిందటి వరకు పలు చెరువులు 50శాతం నిండుకోలేదు. తాజాగా కురిసిన భారీ వర్షాలతో దాదాపు 70శాతానికి పైగా చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం ఒక వేయి 86చెరువులు ఉండగా.. 263 పొంగిపొర్లుతున్నాయి. 543 చెరువులు 75 శాతం పైబడి నీటితో నిండాయి. మరో 15 రోజుల్లో దాదాపు అన్ని చెరువులు నీటితో నిండుతాయని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి :