Bihar Rains : బిహార్‌లో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం పెను విధ్వంసం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షం ధాటికి ఇప్పటివరకు 27 మరణించారు. 24 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముజఫర్‌పూర్‌లో ఆరుగురు, భాగల్‌పూర్‌లో ఆరుగురు, లఖిసరాయ్ జిల్లాలో ముగ్గురు, వైశాలి, ముంగేర్‌లలో ఇద్దరి చొప్పున మరణించారు. బంకా, జాముయి, కతిహార్, జెహానాబాద్, సరన్, నలంద, బెగుసరాయ్‌లలో ఒక్కొక్కరు మరణించారని ప్రాథమికంగా అంచనా వేశారు.
Bihar News: ఈదురుగాలులతో కూడిన వర్షం ధాటికి రోడ్డుపై కంటైనర్ బోల్తా పడగా నదిలో పలు పడవలు చిక్కుకుపోయాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా పలు రైళ్లు రద్దు కాగా.. విమాన సర్వీసులు కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. దిబ్రూగఢ్ నుంచి దిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ ఖగారియాలో నిలిపేశామని రైల్వే అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో ట్రాఫిక్ స్తంభించిందని అధికారులు తెలిపారు. పాట్నా నుంచి భాగల్‌పూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాట్నాలోని రతన్ తోలాలో ఇసుకను తీసుకెళ్తున్న మూడు పడవలు నదిలో మునిగిపోయాయని అధికారులు తెలిపారు. బోటులో ఉన్న వారంతా ఈదుకుంటూ బయటకు వచ్చారని వెల్లడించారు.
Bihar flood deaths: తుపాను ప్రభావం విద్యుత్ , సమాచార వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఖాదియాలోని బీఎస్ఎన్ఎల్ టవర్ కూలిపోగా... పలు జిల్లాల్లో మొబైల్ టవర్లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. అకస్మిక తుఫాను కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈదురుగాలులకు చెట్లు కూలడం, స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది మరమ్మతులను వేగవంతం చేశారు.
Bihar heavy Rains: సమస్తిపూర్, భాగల్‌పూర్, ఖగారియా, దర్భంగా, మధుబని, తూర్పు చంపారన్, సీతామర్హి, షెయోహర్, ముజఫర్‌పూర్, బెగుసరాయ్ సహా మరికొన్ని జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదీ చదవండి: లాలూ ప్రసాద్ ఇంట్లో సీబీఐ సోదాలు