దేశ రాజధాని దిల్లీ భారీ వర్షాలతో (Delhi rain) తడిసి ముద్దవుతోంది. గత మూడు-నాలుగు రోజులుగా అక్కడ వర్షాలు కురుస్తున్నా.. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు రికార్డు స్థాయిలో 112.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెలలో 12 ఏళ్ల తర్వాత ఈ స్ధాయి వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. దిల్లీలో ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో సగటున 125.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉండగా, నెల తొలి రోజే అందులో 90శాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాల ధాటికి దిల్లీ సహా చుట్టు పక్కల ఉన్న నోయిడా, గురుగ్రామ్‌లోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై మోకాలి లోతు నీరు చేరింది. దిల్లీలోని మింటో బ్రిడ్జి, జనపథ్ రోడ్, లజపత్ నగర్ మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఎయిమ్స్ ఫ్లై ఓవర్, రోహతక్ రోడ్, గురుగ్రామ్, నోయిడాలో పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. రహదారులపై వరద నీటి కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అండర్‌పాస్‌లలో కార్లు నీట మునిగాయి. వాహన ఇంజిన్‌లలోకి నీరు చేరి అవి ముందుకు కదలక మొరాయించడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనాలు అందులో చిక్కుకుపోయాయి. కొన్ని చోట్ల ఉదయమే చీకట్లు అలముకోవడం వల్ల వాహనదారులు హెడ్‌లైట్‌లు వేసి వాహనాలను నడిపించాలని దిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
భారీ వర్షాల ధాటికి దిల్లీలో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాహనాలపై విరిగిన చెట్లు పడటం వల్ల అవి దెబ్బతిన్నాయి. చెట్లు కూలడం దిల్లీలో ట్రాఫిక్ కష్టాలను మరింత పెంచింది. దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీరు చేరింది. అకస్మాత్తుగా కుండపోత విరుచుకుపడడం వల్ల దిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి : India Taliban Talks: 'కశ్మీర్ కోసం తాలిబన్లతో భారత్ డీల్!'