తమిళనాడులో కొన్నిరోజుల నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు (rains in chennai) చాలా ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 4 రోజుల్లో 91 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. చెన్నైలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
చెన్నై సహా చుట్టు పక్కల ఉన్న చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం ప్రాంతాల్లో పెద్దమొత్తంలో వాననీరు నిలిచింది. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇళ్లు, ఆస్పత్రుల్లోకి వరద నీరు చేరింది.
చెన్నై కేకే నగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రి జలమయమయింది. రోగుల వార్డుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రోజువారీగా వచ్చే అవుట్ పేషెంట్ వార్డుతో సహా అన్ని విభాగాలు పనిచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
చెన్నైలోని మెరీనా బీచ్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రావొద‌్దని ప్రభుత్వం సూచించింది.
వర్షానికి తోడు చెన్నైలో తీవ్రగాలులు వీస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ను గురువారం మధ్యాహ్నం తాత్కాలికంగా మూసివేశారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (tamilnadu rain news) బలపడి వాయుగుండంగా మారినట్లు పేర్కొన్న వాతావరణ విభాగం.. గురువారం సాయంత్రం తీరం దాటనున్నట్లు పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అప్రమత్తం చేసింది.
ఇదీ చదవండి: తమిళనాడును వదలని వర్షాలు.. 12కి చేరిన మృతులు