వాతావరణ మార్పుల కారణంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా వేడి తీవ్రత పెరగడం, వడగాల్పులతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గడిచిన ఐదు దశాబ్దాల్లో వడగాల్పుల కారణంగా దేశవ్యాప్తంగా 17వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోనే మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపింది.
దేశంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ నేతృత్వంలో కమల్‌జిత్ రాయ్, ఎస్‌ఎస్ రాయ్, ఆర్‌కే గిరి, ఏపీ దిమ్రీ వంటి వాతావరణ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. 1971 నుంచి 2019 వరకు దాదాపు 706 వడగాల్పుల సంఘటనలు జరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా ఉత్తరభారతంలో వడగాల్పుల ప్రభావం పెరిగిన నేపథ్యంలో తాజా అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ..
ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా అత్యంత తీవ్రమైన వాతావరణ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో వడగాల్పుల సంఘటన కూడా ఒకటి. 1971 నుంచి 2019 వరకు ఇలా తీవ్రమైన వాతావరణ సంఘటనల్లో దాదాపు లక్షా 41వేల (1,41,308) మంది ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాతావరణశాఖ తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో 12శాతానికి పైగా (17,362) మరణాలు కేవలం వడగాల్పుల వల్లే జరిగాయని తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోనే ఎక్కువ మరణాలు సంభవించినట్లు తాజా నివేదిక పేర్కొంది.
వడగాల్పులుగా ఎప్పుడు ప్రకటిస్తారంటే..
కోస్తా ప్రాంతాల్లో 40డిగ్రీలు, ఇతర ప్రాంతాల్లో 45డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు వేడిగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. ముఖ్యంగా సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రత కంటే వాస్తవ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు వడగాలుల హెచ్చరికలు చేస్తుంది. అయితే, కోర్ హీట్‌వేవ్ జోన్లుగా పిలిచే ప్రాంతాల్లోనే హీట్‌వేవ్, సీవియర్ హీట్‌వేవ్ సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మే నెలలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఝార్ఖండ్, బంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రాలు ఈ కోర్ హీట్‌వేవ్ జోన్ల కిందకే వస్తాయి.
ఇక గడిచిన కొన్నేళ్లుగా దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పుల సంఖ్య పెరుగుతున్నట్లు భూశాస్త్ర మంత్రిత్వశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గతేడాది పేర్కొన్నారు. 2017లో దేశవ్యాప్తంగా 30హీట్‌వేవ్ సంఘటనలు జరగగా.. వీటిలో ఏపీ-1, ఝార్ఖండ్-2, మహారాష్ట్ర-6, ఒడిశా-8, తెలంగాణ-12, బంగాల్-1 రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. 2018లో 12 సార్లు వడగాల్పులు సంభవించాయి. ఇక 2019లో 26సార్లు హీట్‌వేవ్ సంఘటనలు.. మహారాష్ట్ర(12), కేరళ(6), బిహార్(4), రాజస్థాన్(1) రాష్ట్రాల్లో ప్రభావం చూపించాయి. ఇలాంటి వడగాల్పుల సంఘటనలు పెరగడానికి వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు పెరగడమే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, తీవ్ర స్థాయిలో వచ్చే వడగాల్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఎక్కువ సమయం వీటికి లోనైతే డీహైడ్రేషన్, తిమ్మిరులు రావడం, నిస్సత్తువ, గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఇదీ చూడండి: పుడమికి పునరుజ్జీవం జీవజాలానికి అభయం
ఇదీ చూడండి: ఈ దృశ్యాలు మీరు ఎప్పుడైనా చూశారా?