కొవిడ్ నిబంధనలు పాటించే పరిస్థితి లేకుంటే భారత్ జోడో యాత్రను నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ. ఈ మేరకు రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు లేఖ రాశారు. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు భాజపా ఎంపీలు పీపీ చౌదరి, నిహాల్ చంద్, దేవ్‌జీ పటేల్ కేంద్ర ఆరోగ్యమంత్రికి లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు వాడాలని టీకా వేసుకున్నవారినే అనుమతించేలా చూడాలని కోరారు. వేరే రాష్ట్రాల వారు వస్తున్నందున యాత్రలో పాల్గొన్నవారిని ఐసోలేట్ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ముగ్గురు ఎంపీల లేఖను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ, గహ్లోత్‌కు లేఖ రాసిన ఆరోగ్యమంత్రి కొవిడ్ నిబంధనలు పాటించలేకుంటే జాతి ప్రయోజనాలకోసం యాత్రను నిలిపివేయాలని కోరారు. యాత్రలో పాల్గొని వెళ్లిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్..కరోనా బారిన పడినట్లు ఎంపీలు తెలిపారని మాండవీయ వివరించారు.
భాజపా యాత్రలకు లేఖలు పంపారా?
ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ రాహుల్‌కు పంపిన లేఖపై కాంగ్రెస్ స్పందించింది. "దయచేసి కొవిడ్ ప్రోటోకాల్‌లను ప్రకటించండి. మేము వాటిని అనుసరిస్తాం. అయితే రాజస్థాన్, కర్ణాటకలో భాజపా యాత్రలు చేస్తోందని.. మరి ఆరోగ్య శాఖ మంత్రి, వారికి కూడా లేఖలు పంపారా?" అని ఆ పార్టీ నేత పవన్ ఖేడా ప్రశ్నించారు.
ద్వేషపూరిత మార్కెట్లో ప్రేమ అనే షాప్ ప్రారంభిస్తా
భారత్ జోడో యాత్రలో భాగంగా హరియాణా నుహ్‌లో ప్రవేశించిన రాహుల్ గాంధీ, భాజపాను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ.. "ద్వేషపూరితమైన మార్కెట్లో ప్రేమ అనే షాప్‌ను భారత జోడో యాత్ర ద్వారా ప్రారంభిస్తాను. మీలాంటి వాళ్లు దేశంలో ద్వేషాన్ని నింపేందుకు ప్రయత్నిస్తే, మాలాంటి వాళ్లు ప్రేమను పంచేందుకు వెళ్తారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మన దేశంలో అతి పెద్ద సమస్యలు. అయితే ఈ రెండు సమస్యలపై పోరాటం ఇప్పటిది కాదు, వేల సంవత్సరాలుగా కొనసాగుతోంది. కార్లు, విమానాలు, హెలికాఫ్టర్లలో కూర్చుని నేర్చుకోలేనిది ఈ యాత్ర ద్వారా తెలుసుకున్నాను. ప్రజలకు, నాయకులకు మధ్య అఘాతం ఏర్పడింది. ఈ యాత్ర ద్వారా ప్రజల సమస్యలను నేరుగా వెళ్లి తెలుసుకుంటున్నాను" అని ఆయన అన్నారు.