దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాల విడుదలను నిలిపివేయాలన్న అభ్యర్థనను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సినిమాలు నటుడి బయోపిక్‌లు కాదని, సుశాంత్ జీవితంలో ఏం జరిగిందో అని వివరించే వాస్తవ కథాంశాలు కావని ధర్మాసనం అభిప్రాయపడింది. మరణాంతర గోప్యత హక్కును ఈ విషయంలో అనుమతించలేమని పేర్కొంది. ఈ మేరకు సుశాంత్ తండ్రి కృష్ణ కిశోర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సినిమాలు వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన కల్పిత చిత్రాలని నిర్మాతలు, దర్శకులు పేర్కొన్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. జరిగిన ఘటనలకు సంబంధించిన వివరాలు ఇప్పటికే ప్రజాబాహుళ్యంలో ఉన్నాయని, కాబట్టి ఈ సినిమాలు గోప్యతా హక్కులను ఉల్లంఘించలేవన్న నిర్మాతలు, దర్శకుల వాదనను హైకోర్టు సమర్థించింది. అయితే, ఈ చిత్రాల ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
'సుప్రీంకు వెళ్తాం'
హైకోర్టు తీర్పు అనంతరం సుశాంత్ తండ్రి కృష్ణ కిశోర్ సింగ్‌ను ఈటీవీ భారత్ సంప్రదించింది. తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన.. కోర్టు ఉత్తర్వులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.
సుశాంత్ సింగ్ జీవితం ఆధారంగా 'న్యాయ్ ది జస్టిస్', 'సూసైడ్ ఆర్ మర్డర్- ఎ స్టార్ వస్ లాస్ట్', 'శశాంక్' అనే చిత్రాలు నిర్మితమవుతున్నాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా మరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇదీ చదవండి: టీకా తీసుకున్న వారిలో అయస్కాంత శక్తి- నిజమెంత?