నేషనల్ హెరాల్డ్ కేసులో భాజపా పార్లమెంట్ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి వేసిన పిటిషన్పై సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, ఇతరులకు దిల్లీ హైకోర్టు మరింత గడువిచ్చింది. మే 18లోపు సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఫిబ్రవరి 22న నాలుగు వారాల్లో సమాధానమివ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కొవిడ్-19 కారణంగా తమ కార్యాలయం పనిచేయలేదని, అందుకే సమాధానం ఇవ్వలేకపోయామని కాంగ్రెస్ నాయకుల తరఫున వాదించిన న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో మే 18 వరకు గడువిచ్చింది.
ఏంటీ కేసు?
కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు.
ఇదీ చదవండి : ఉపలోకాయుక్తగా 'బాబ్రీ' తీర్పు చెప్పిన న్యాయమూర్తి