ఓ వ్యక్తిని ఐదుగురు దుండగులు కర్రలతో తీవ్రంగా కొట్టి, పదునైన ఆయుధంతో గాయపరిచారు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటన హరియాణాలోని సోనీపత్ జిల్లాలో ఈనెల 25న జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
ఏం జరిగింది?
జిల్లాలోని దీపాల్పుర్ గ్రామంలో ఓ గోశాలలో పని చేస్తున్నాడు బాధితుడు ప్రవీణ్. రోజూలానే పనిలోకి వెళ్లాడు. ఈ క్రమంలోనే సుమారు ఐదుగురు అతన్ని చుట్టుముట్టి కర్రలతో చితకబాదారు. అక్కడి నుంచి తీసుకెళ్లి కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు.
"గోశాలలో పని చేసేందుకు వెళ్లాను. మంజీత్ అలియాస్ పెడ, సునీల్, దీపక్, రాకీ సహా మరో ఇద్దరి నుంచి ముగ్గురు నన్ను చుట్టు ముట్టారు. ఈరోజే వారి డబ్బులు చెల్లించేస్తానని చెప్పినా వినలేదు. కర్రలతో చితకబాదారు. దాడి చేస్తున్న క్రమంలో గోశాలలోని ఏ ఒక్కరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. నా కుటుంబాన్నీ చంపేస్తామని బెదిరించారు."
- ప్రవీణ్, బాధితుడు
సుమారు 5 నిమిషాల పాటు కర్రలతో బాధితుడిపై దాడి చేసినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం డబ్బుల కోసం గొడవ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రవీణ్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టామని బహల్గఢ్ స్టేషన్ ఇంఛార్జి రణ్బిర్ సింగ్ తెలిపారు.
ఇదీ చూడండి: కల్తీ మద్యం: 55కు చేరిన మృతుల సంఖ్య!