Harnaaz Sandhu Etv Bharat interview: మిస్ యూనివర్స్‌ను ప్రకటించే సమయంలో భారతదేశం పేరును ప్రస్తావించినప్పుడు ఎంతో గర్వపడినట్టు 21ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు తెలిపింది. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను అని.. 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పింది.
"అవి అద్భుతమైన క్షణాలు. విన్నర్‌ను ప్రకటించే సమయంలో నా పేరు కాకుండా.. నా దేశం పేరును చెప్పడం చాలా గర్వంగా అనిపించింది. నా దేశం పేరును ప్రస్తావించిన ప్రతీసారి గర్వపడ్డాను. 2021 మిస్ యూనివర్స్ నేనే అని తెలిసినప్పుడు చాలా భావోద్వేగానికి లోనయ్యాను."
--- హర్నాజ్ సంధు, మిస్ యూనివర్స్.
ఇటీవలే.. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో 80 దేశాల నుంచి భామలు పాల్గొనగా.. వీరందరినీ వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది సంధు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ టైటిల్ దక్కింది. చివరిసారిగా 2000లో లారా దత్తా మన దేశం తరఫున ఈ కిరీటం దక్కించుకుంది. అంతకుముందు 1994 సుశ్మితా సేన్ ఈ ఘనత సాధించింది.
Harnaaz Sandhu miss universe: "పోటీలకు సిద్ధమవ్వడానికి 30రోజులే లభించింది. ర్యాంప్ వాక్, కమ్యూనికేషన్, మేకప్, డైట్, జిమ్ ట్రైనింగ్‌పై శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. నా కుటుంబసభ్యుల అండతోనే నేను గెలవగలిగాను," అని సంధు చెప్పింది.
ఈ సందర్భంగా.. ఛండీగఢ్‌లో గడిపిన రోజులను గుర్తుచేసుకుంది మిస్ యూనివర్స్.
"కుటుంబసభ్యుల మద్దతు నాకు ఎల్లప్పుడు లభించింది. నాకు 'పంజాబీ కా షేర్నీ' అని పేరు పెట్టింది మా నాన్నే. మా అమ్మ ఓ గైనకాలజిస్ట్. మంచి స్నేహితురాలిగా నన్ను ప్రోత్సహించింది. ఛండీగఢ్‌లోనే నేను నా చదువును పూర్తిచేశాను. అక్కడ.. వివిధ మతాల వారు కలిసి జీవిస్తారు. అదే ఛండీగఢ్ ప్రత్యేకత! మళ్లీ అక్కడి వెళ్లాలని ఉంది."
--- హర్నాజ్ సంధు, మిస్ యూనివర్స్.
మోడలింగ్ మొదలుపెట్టినప్పుడు తన వయసు 17ఏళ్లని, ఆ సమయంలో తనొక ఇంట్రోవర్ట్ అని వివరించింది సంధు. ఇప్పటికే రెండు పంజాబీ సినిమాల్లో నటించిన సంధు.. తన భవిష్యత్తు ప్రాజెక్టులపై ఇప్పుడే చెప్పలేనని పేర్కొంది.
ఇదీ చూడండి:- విశ్వ సుందరికి సైకత శిల్పంతో అభినందనలు