Hanamkonda court granted bail to Sanjay: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు బెయిల్ మంజూరైంది. సంజయ్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హనుమకొండ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద ఆయన తరఫు న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పీపీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. బండి సంజయ్‌ను 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఇరు వైపులా సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి.. బండి సంజయ్‌కు.. రూ.20 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ ఇచ్చింది.
Bandi Sanjay granted bail in SSC paper leak : పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో ఎంపీ బండి సంజయ్ ప్రధాన కుట్రదారు అని పోలీసులు అభియోగం మోపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్‌లో జడ్పీ పాఠశాలలో జరిగిన లీకేజీ కేసులో సంజయ్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయన ప్రోద్బలంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నపత్రాన్ని పరీక్షకేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సప్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఆరోపించారు. ఆయనపై 120 (బి), 420, 447, 505 (1)(బి) ఐపీసీ, 4(ఎ), 6, రెడ్‌విత్ 8 ఆఫ్ టీఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్-1997, సెక్షన్ 66-డి ఐటీ యాక్ట్-2008 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈటల రాజేందర్‌కు నోటీసులు: మరోవైపు ఈ కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని ఆయన నివాసానికి వెళ్లి.. ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపారు.
160 సీఆర్పీసీ కింద నోటీసులు అందించారు. ఈటల రాజేందర్ పీఏలు రాజు, నరేంద్రలకు ఈ నోటీసులను అందించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నోటీసులపై ఈటల రాజేందర్ స్పందించారు. ఈనెల 10న విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు హన్మకొండ డీసీపీ ఆఫీసుకు వెళ్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతలంటే బానిసలా..!: బండి సంజయ్ అరెస్ట్, ఈటల రాజేందర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులను పావులుగా వాడుకోవడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. పోలీసు వ్యవస్థను ఇంతగా దుర్వినియోగం చేసిన రాష్ట్రం మరొకటి లేదని ఆరోపించారు. వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తే పోలీసు విచారణకు పిలవటం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు అంటే బానిసలు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి:
బండి సంజయ్ అరెస్ట్.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల నిరసనల హోరు