ఏదైనా ఎద్దు ధర సాధారణంగా రూ.వేలల్లో ఉంటుంది. అయితే కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం ఎద్దు మాత్రం ఏకంగా రూ.9 లక్షలకుపైగా ధరకు అమ్ముడుపోయింది. ఆ ఎద్దు ప్రత్యేకత ఏంటి? ఆ ఎద్దు అంత రేటు పలకడానికి గల కారణాలేంటి? తెలుసుకుందామా మరి.
మండ్య జిల్లా.. శ్రీరంగపట్నం తాలుకాలోని శ్రీనివాస అగ్రహారానికి చెందిన నవీన్‌కు ఎద్దుల బండి పందేలు అంటే చాలా ఇష్టం. అందుకే నవీన్.. మంచి మేలు జాతి ఎద్దులను కొనుగోలు చేసి పెంచుతుంటాడు. ఏడాదిన్నర క్రితం అతడు మండ్య జిల్లాలోని ఇందువాలు గ్రామానికి చెందిన అజిత్ నుంచి రూ.లక్షా యాబై వేలు పెట్టి హల్లికర్ జాతికి చెందిన ఎద్దును కొన్నాడు. ఆ ఎద్దుకు 'జాగ్వర్' అని నామకరణం చేశాడు. ఎద్దుల బండితో వేగంగా పరుగెత్తెలా జాగ్వర్కు శిక్షణ ఇచ్చాడు నవీన్. ఈ క్రమంలో జాగ్వర్ రాష్ట్రవ్యాప్తంగా అనేక ఎద్దుల బండి పోటీల్లో పాల్గొని బహుమతులను గెలిచింది. కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాలోనూ జాగ్వర్ మంచి పేరు సంపాదించింది.
ఈ క్రమంలో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ రైతు.. నవీన్ దగ్గర ఉన్న ఎద్దుకు ఏకంగా రూ.9 లక్షల 20 వేలకు కొనుగోలు చేశాడు. ఈ ఎద్దు హల్లికర్ అనే మేలు జాతికి చెందినదనని, అనేక ఎద్దుల పందేల్లో విజేతగా నిలిచిందని.. అందుకే భారీ ధర పలికిందని చెప్పాడు నవీన్. తాను పెంచిన ఎద్దు ఇంత ధర పలకడం ఆనందంగా ఉందని అన్నాడు.
రూ.14 లక్షలకు ఎద్దు అమ్మకం..
ఈ ఏడాది జనవరిలో.. కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాకు చెందిన ఇద్దరు రైతు సోదరులు తాము పెంచుకున్న ఎద్దును ఏకంగా రూ.14 లక్షలకు అమ్మారు. ఏడాది క్రితం రూ.5 లక్షలకు కొన్న ఈ ఎద్దును ఇంత పెద్ద మొత్తంలో విక్రయించటం వల్ల ప్రస్తుతం చుట్టుపక్కల వారందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. బాగల్‌కోట్ జిల్లాలోని మెటగుడ్డ హలకి గ్రామానికి చెందిన కాశిలింగప్ప గడదర, యమనప్ప గడదర అనే ఇద్దరు అన్నదమ్ములు సంవత్సరం కిందట రూ.5 లక్షల రూపాయలకు ఈ ఎద్దును రాద్యరట్టి గ్రామంలో కొన్నారు. ప్రస్తుతం దీనిని నందగావ్ గ్రామానికి చెందిన విఠ్ఠల అనే పాడి రైతుకు విక్రయించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.