Guru Granth Sahib Sacrilege Case: గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రమైన ఘటన కేసులో నిందితుడు రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబాను పంజాబ్ తరలించడంపై పంజాబ్-హరియాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారీ బందోబస్తుతో పంజాబ్ తీసుకెళ్లేందుకు అతను వీఐపీనో లేక ప్రధానో కాదని వ్యాఖ్యానించింది. హరియాణా రోహ్తక్లోని సునారియా జైలులో ఉన్న రామ్ రహీమ్‌ను 3,500 పోలీసుల భద్రత మధ్య హెలికాప్టర్లో పంజాబ్‌కు తరలిస్తామన్న ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ డీఎస్ పాట్వాలియా వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించింది హైకోర్టు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా జరిగిన భద్రతా వైఫల్యాన్ని ప్రస్తావించింది. బుధవారం ఏం జరిగిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించింది. రామ్‌రహీమ్‌ను విచారించాలంటే సునేరియా జైలుకు వెళ్లి అతడ్ని కలవాలని పంజాబ్ అధికారులకు సూచించింది.
పంజాబ్ ప్రభుత్వం ఇదివరకే 15 రోజులు గడువు అడిగిందని.. మరోసారి విచారణ వాయిదా వేయాల్సి వస్తే ఎన్నికల తర్వాత నిర్వహించాలని కోర్టుకు నిందితుడి తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది. అయితే విచారణ తేదీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఇదీ కేసు..
2015లో ఫరీద్‌కోట్‌లో గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రమైన ఘటనకు సంబంధించి డేరా బాబా నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే పలు కేసుల్లో హరియాణాలోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్‌ను గురుగ్రంథ్ కేసు విచారణలో భాగంగా పంజాబ్‌కు తీసుకురావాలని పంజాబ్‌లోని ఫరీద్కోట్ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇదీ చూడండి : రాష్ట్రపతితో మోదీ భేటీ- భద్రతా వైఫల్యంపై ఆందోళన..