ఆయనకు చిన్నప్పటి నుంచి లండన్‌కు వెళ్లాలని కోరిక ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. అప్పుడే అతడు ఓ నిర్ణయానికి వచ్చాడు. లండన్ నగర నమూనాను తయారు చేసి ఆనందం పొందవచ్చని అనుకున్నాడు. గూగుల్ మ్యాప్ ఉపయోగించి మూడున్నరేళ్లు కష్టపడి లండన్ సిటీ నమూనాను ఎంతో అద్భుతంగా తయారు చేశాడు. అతడే పంజాబ్‌లోని లుధియానాకు చెందిన గుర్దీప్ సింగ్.
గుర్దీప్ సింగ్.. చిన్నప్పటి నుంచి వివిధ నగరాలు, స్టేడియంల నమూనాలను తయారు చేసేవాడు. ఆ ఆసక్తితోనే కేవలం అట్టను ఉపయోగించి లండన్ నగర నమూనాను రూపొందించాడు. లండన్‌లోని ప్రతీ భవనం, రహదారులు, రైల్వే స్టేషన్.. ముఖ్యంగా బ్రిడ్జ్‌ను ఎంతో అందంగా తయారు చేశాడు. నీటి వల్ల అట్ట పాడవ్వకుండా ఉండేందుకు ఐరన్ షీట్‌ను కూడా ఉపయోగించాడు. ముఖ్యంగా ఆకర్షణీయమైన లైట్లను అమర్చాడు. వాటి వల్ల మొత్తం నమూనాకే అందం వచ్చిందని చెప్పొచ్చు.
"లండన్ నమూనాను తయారు చేయడానికి 3.5 సంవత్సరాల సమయం పట్టింది. రాత్రిపూట కూడా శ్రమించి దీనిని పూర్తిచేశాను. మూడున్నరేళ్ల శ్రమ తర్వాత ఈ నమూనా తయారైంది. ఇంత గొప్పగా వస్తుందని అనుకోలేదు. దీనిని తయారు చేయడానికి డబ్బులు ఎప్పుడూ లెక్కలు వేయలేదు. రూ.50వేల దాకా ఖర్చయి ఉంటుంది. లండన్ వెళ్లి అక్కడ నివసించాలనేదే నా కల. అక్కడకి వెళ్లడానికి ప్రయత్నించాను కానీ వీసా రాకపోవడం వల్ల వెళ్లలేకపోయాను. మొదట నమూనాను తయారు చేయడానికి పలు వీడియోలు చూసినప్పుడు చాలా తికమకపడ్డాను. తర్వాత కొంత మంది సహాయంతో దీనిని పూర్తి చేయగలిగాను. నాకు చిన్నప్పటి నుంచి నమూనాలు తయారు చేయడం అంటే ఇష్టం. ఇంతకు ముందు కూడా మొహలీ హుభు స్టేడియంను కూడా తయారు చేశాను. కానీ ఇంట్లో స్థలం లేకపోవడం వల్ల ఆ నమూనా పాడైపోయింది. నేను తయారు చేసిన లండన్ నమూనాను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తాను."
-- గుర్దీప్ సింగ్
లండన్ సిటీలో టూరిస్ట్‌లను ఎంతగానో ఆకర్షించే బ్రిడ్జ్‌ను చక్కగా తయారు చేసిన గుర్దీప్.. దానికి రిమోట్ కంట్రోల్ సిస్టమ్‌ను అమర్చాడు. బటన్ ప్రెస్ చేస్తే బ్రిడ్జి.. విడిపోయి మళ్లీ కలుస్తుంది. ఈ నమూనాను చూస్తుంటే మినీ లండన్‌ను చూసినట్లుగా ఉందని స్థానికులు చెబుతున్నారు.