గాంధీ కుటుంబంతో పాటు రాహుల్ గాంధీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. తమ పార్టీ అధినాయకత్వంపై ఆజాద్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని నిరాశను ప్రతిబింబిస్తున్నాయని హస్తం పార్టీ ఎద్దేవా చేసింది.
రాహుల్ గాంధీ సహా మొత్తం గాంధీ కుటుంబానికి అవాంచిత వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఓ మలయాళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆజాద్ ఆరోపించారు. రాహుల్ గాంధీ అవాంచిత వ్యాపారులను కలిసేందుకు విదేశాలకు వెళ్తారని.. వాటిని నిరూపించేందుకు తాను పది ఉదాహరణలు ఇవ్వగలనని పేర్కొన్నారు. ఆజాద్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్. ప్రధాని మోదీ పట్ల విధేయతను చాటుకునేందుకు ఆజాద్ రోజురోజుకు మరింత దిగిజారుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వంపై ఆజాద్ ధిక్కారస్వరం ఆయనలోని నిరాశతోపాటు దయనీయ స్థితిని చాటుతోందని ట్వీట్ చేశారు.
రాహుల్ మౌనం వీడాలి: రవిశంకర్ ప్రసాద్
మరోవైపు, ఇదే అదనుగా భావిస్తున్న బీజేపీ.. ఆజాద్ మాటలను హైలైట్ చేస్తోంది. అవాంచిత వ్యాపారవేత్తలతో రాహుల్ గాంధీకి సంబంధాలున్నాయంటూ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించాలంటూ బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ సోమవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
"ఈ 'అవాంచిత వ్యాపారవేత్తలు' ఎవరు..? వారి ప్రయోజనాలు ఏమిటి? భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిపేందుకే రాహుల్ గాంధీ ఈ ప్రయత్నాలు చేస్తున్నారా?" అని రవిశంకర్ ప్రశ్నలు గుప్పించారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు రాహుల్ ఈ కుట్రలు చేస్తున్నారనడానికి ఆజాద్ మాటలే ఉదాహరణ అని రవిశంకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో జరిగిన అనేక కుంభకోణాల్లో హస్తం నేతల ప్రమేయంపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని రవిశంకర్ ప్రశ్నించారు. మొత్తంగా ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ మౌనం వీడాలని రవిశంకర్ డిమాండ్ చేశారు.
తన ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా ఆజాద్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కాంగ్రెస్ నాయకత్వాన్ని, పార్టీని దూషిస్తూనే ఉన్నారు గులాం నబీ ఆజాద్. చేతకానివాడిలా ఉంటేనే కాంగ్రెస్‌లో కొనసాగే అవకాశం ఉందంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ చేసిన పనుల్లో 50వ వంతు చేసినా.. రాహుల్ విజయవంతం అయ్యేవారని అన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని పేర్కొన్న ఆయన.. అవసరమైతే జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో చేతులు కలుపుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన తర్వాత ఆజాద్ తన సొంత పార్టీని స్థాపించారు.