Gujarat Rains Death Toll : ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు, పిడుగుపాటు ఘనటలకు గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక పురపాలక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు అధికారులు సోమవారం చెప్పారు. 'రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు, వర్షాల కారణంగా 20 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి' అని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్(ఎస్‌ఈఓసీ)అధికారి తెలిపారు.
దాహోద్ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, తాపీలో ఇద్దరు, అహ్మదాబాద్, అమ్రేలి, బనస్కాంఠ, బోటాడ్, ఖేడా, మెహసానా, పంచమహల్, సబర్‌కాంత, సూరత్, సురేంద్రనగర్, ద్వారకలో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు ఎస్‌ఈఓసీ అధికారి వెల్లడించారు.
హోంమంత్రి ట్వీట్..
రాష్ట్రంలో కురిసిన వర్షాలు, పిడుగుల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"గుజరాత్‌లోని వివిధ నగరాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా కురిసిన వర్షాలకు, పిడుగులకు 20 మంది చనిపోయారన్న వార్త విని చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు ఆ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. స్థానిక యంత్రాంగం సహాయక చర్యలను వేగవంతం చేసింది."
- ఎక్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
భారీగా పంట నష్టం..
గుజరాత్లో సోమవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. అధికారిక గణాంకాల ప్రకారం గుజరాత్‌లోని 234 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపీ, బరూచ్, అమ్రేలి జిల్లాల్లో 16 గంటల్లో 50-117 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. రాజ్‌కోట్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిశాయి. అయితే అనూహ్య స్థాయిలో వర్షాలు కురవడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా భారీగా పంట నష్టం కూడా వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇక మోర్బి జిల్లాలోని ప్రముఖ సిరామిక్ పరిశ్రమపై కూడా వర్షప్రభావం తీవ్ర స్థాయిలో కనిపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని పలు ఫ్యాక్టరీలను మూసివేయించారు అధికారులు. ఈశాన్య అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో ఏర్పడిన తుపాను కారణంగా వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది.
'పవర్'ఫుల్ వృద్ధుడు- రష్యన్ IPLలో సత్తా! 57 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్
లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరం నమూనా- విభిన్న మతాల శిల్పకారులతో నిర్మాణం