గుజరాత్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన అహ్మదాబాద్‌లో సర్దార్‌ధామ్ భవన్ కార్యక్రమంలోపాల్గొన్న రూపానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ రాజీనామా చేశారు.
2016లో ఆనందీబెన్ పటేల్ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి పగ్గాలు స్వీకరించిన రూపానీ.. 2017లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విజయవంతంగా నడిపించారు. ఫలితంగా రెండోసారి భాజపా అధిష్ఠానం ఆయనపైనే నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆయనకు డిప్యూటీగా నితిన్ పటేల్ విధులు నిర్వహిస్తున్నారు. భాజపా అధిష్ఠానం నూతన ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
గుజరాత్ నూతన నాయకత్వంపై పార్టీ సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లో భాజపా నాయకులు సమావేశమై చర్చలు జరుపుతున్నారు.
భాజపాకు కృతజ్ఞతలు..
రాజీనామా చేసిన అనంతరం గాంధీనగర్లో మీడియాతో మాట్లాడారు విజయ్ రూపానీ. తనకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
"గుజరాత్ ముఖ్యమంత్రిగాసేవలందించేందుకు ఈ అవకాశం ఇచ్చిన భాజపాకు నా కృతజ్ఞతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరో మెట్టు ఎక్కించేందుకు అవకాశం లభించింది. భవిష్యత్తులోనూ పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటాను. భాజపాలో పార్టీ కార్యకర్తల మధ్య భాద్యతలు సమయానుకూలంగా మారే సంప్రదాయం ఉంది. భవిష్యత్తులో ఎలాంటి భాద్యత అప్పగించినా స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నా.
భాజపాలో పార్టీ వర్కర్ల మధ్య రిలే మాదిరిగా పోటీ ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి అధికారం అప్పగించాలి. తదుపరి సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుంది. "
- విజయ్ రూపానీ, గుజరాత్ ముఖ్యమంత్రి.