Gujarat chemical factory blast: గుజరాత్ పంచమహల్ జిల్లాలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరో 16మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పంచమహల్ ఘోఘాంబ తాలూకా రంజిత్ నగర్ గ్రామ సమపంలోని గుజరాత్ ఫ్లూరోకెమికల్స్ లిమిటెడ్లో (GFL) గురువారం ఉదయం 10గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు జిల్లా కలెక్టర్ సుజల్ మయాత్ర తెలిపారు. మొదట పేలుడు సంభవించిందని ఆ తర్వాత మంటలు వ్యాపించాయని వివరించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసినట్లు చెప్పారు. సీఎం కార్యాలయం కూడా విషయం తెలుసుకుని అధికారులకు సూచనలు చేసిందని వెల్లడించారు. ఆస్పత్రిలో ఉన్న 16 మందిలో 14 మందికి ప్రాణాపాయం లేదని, మరో ఇద్దరికి మాత్రం 50 శాతానికిపైగా కాలిన గాయాలయ్యాయని పేర్కొన్నారు.
Chemical factory fire
ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపు చేశాక మొదట రెండు మృతదేహాలే లభ్యమయ్యాయి. ఆ తర్వాత ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించాక మరో ముగ్గురి మృతదేహాలు దొరికాయి. దీంతో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. గాయపడ్డవారికి సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ చిన్నారి- 15 అడుగుల లోతులో..