గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన స్థానంలో ఘన విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ తరఫున అహ్మదాబాద్ జిల్లాలోని ఘట్లోడియా స్థానం నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి ఆమ్నీ యాగ్నిక్పై 81 వేలకు పైగా ఓట్లతో గెలిచారు. ఆమ్నీ యాగ్నిక్‌కు 9900 ఓట్ల వచ్చాయి. మొత్తం ఈ నియోజకవర్గంలో 59.62 శాతం ఓట్లు.. అంటే లక్షా ఏడు వందల ఓట్లు పోలయ్యాయి. ఇందులో భూపేంద్ర పటేల్ ఏకంగా 81 శాతం ఓట్లు పొందారు.
ప్రస్తుతం భూపేంద్ర పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయన పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారు. అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్‌రూపాని రాజీనామా అనంతరం భూపేంద్ర పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2021 సెప్టెంబర్ 13న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 2017లో సైతం ఘట్లోడియా స్థానం నుంచే భూపేంద్ర పటేల్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్ పోటీ చేసిన ఆయన.. 1.15 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.
ఘట్లోడియా నియోజకవర్గం..
ఈ నియోజకవర్గం అహ్మదాబాద్ జిల్లాలో ఉంది. 2012లో మొదటి సారిగా నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ పాటీదార్ల జనాభా ఎక్కువ. 2012లో మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో గుజరాత్‌కు ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన నియోజకవర్గంగా ఘట్లోడియా నిలిచింది. 2018 లెక్కల ప్రకారం ఇక్కడి మొత్తం ఓటర్ల సంఖ్య 3,57,367. వీరిలో 1,83,823 మంది పురుషులు కాగా 1,73,542 మంది మహిళా ఓటర్లు.