గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారకా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో (Superstitious Beliefs) అమానుషానికి ఒడిగట్టారు. కోపంతో ఉన్న దేవత పూనిందని.. ఆమె అందరినీ చంపేస్తుందేమోనని భయపడి ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆరంభదా గ్రామానికి చెందిన రమీలా సోలంకి అనే మహిళ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం.. సమీపంలోని ఒఖంబది గ్రామానికి భర్తతో కలిసి వెళ్లింది. అయితే ఉత్సవాల్లో పాల్గొన్న రమీలా ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ప్రవర్తించింది.
అయితే ఆమెకు కోపంతో ఉన్న అమ్మవారు పూనిందని అక్కడే ఉన్న భూతవైద్యుడు రమేశ్ సోలంకి అక్కడి ప్రజలను నమ్మించాడు. కోపంతో ఉన్న అమ్మవారిని పారదోలాలని.. లేదంటే ఆమె అందరిని చంపేస్తుందని భయపెట్టాడు. కోపంతో ఉన్న అమ్మవారిని వెళ్లగొట్టేందుకు రమీలాను కొట్టాలని సూచించాడు. దీంతో అక్కడ ఉన్న ఆమె బంధువులు కర్రలు, మంటల్లో వేడి చేసిన ఇనుప గొలుసులతో రమీలాను చావబాదారు. దీంతో ఆమె తీవ్ర గాయాలతో మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలో పాల్గొన్న ఐదుగురిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రజలపైకి వేగంగా దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి