బలవంతపు మతమార్పిళ్లకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన 'లవ్ జిహాద్' బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇది అమలులోకి వస్తే మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మతమార్పిళ్లకు పాల్పడేవారికి 10 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. అంతేగాక రూ.3 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
2003లో అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టానికి సవరణలు ప్రతిపాదించగా.. గుజరాత్ ప్రీడమ్ ఆఫ్ రిలీజియన్ (సవరణ) బిల్లు-2021ను ఆమోదించింది. అయితే ఓటింగ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది.
భాజపా పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ ఇటువంటి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి.
లవ్ జిహాద్ అంటే..
ఇటీవలి కాలంలో పలు భాజపా పాలిత రాష్ట్రాలు ఈ తరహా చట్టాలు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ప్రేమ, పెళ్లి పేరిట హిందూ మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారేలా చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ ఆర్డినెన్సులు ఉపయోగపడతాయని చెబుతున్నాయి. ఈ బలవంతపు మత మార్పిడులనే 'లవ్ జిహాద్'గా అభివర్ణిస్తున్నాయి.
ఇదీ చూడండి: 'గల్ఫ్ కార్మికుల ఆదాయంపై పన్ను ఉండబోదు'