ఉత్తర కశ్మీర్లోని బారముల్లా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రత బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి.
జిల్లాలోని పత్తన్ సింగ్పొరా మార్కెట్ ప్రాంతంలో ఉదయం 10 గంటల సమయంలో గ్రెనేడ్ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.
" సింగ్పొరా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. అయితే.. వారు అనుకున్న లక్ష్యంలో కాకుండా రోడ్డుపై పడి పేలిపోయింది. ఇందులో ఐదు నుంచి ఆరుగురు స్థానికులు గాయపడినట్లు తెలిసింది."
- పోలీసు అధికారి.
క్షతగాత్రులను పత్తాన్లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు అధికారులు. దాడికి పాల్పడిన ముష్కర మూకలను పట్టుకునేందుకు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నట్లు వెల్లడించారు.