కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ టీకా పంపిణీ ప్రక్రియ న్యాయబద్ధంగా లేదని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. అందులో అసమానతలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని తన ట్వీట్‌కు జోడించారు.
"టీకాలను కేంద్రం సమకూర్చుకుని రాష్ట్రాలకు అందజేయాలని నేను చెబుతూనే ఉన్నాను. టీకా పంపిణీలో సరైన విధానం లేనప్పుడు మోదీ ప్రభుత్వ విధానంలోని అసమానత వల్ల ఇటువంటి ఫలితాలే వస్తాయి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
9 ప్రైవేట్ ఆస్పత్రులు వద్ద 50 శాతం కరోనా టీకా నిల్వలు ఉన్నాయని, ఆరు నగరాల్లో 80 శాతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా నిల్వలు ఉన్నాయని ఆ పత్రికా కథనం వెల్లడించింది.
సెంట్రల్ విస్టానే ప్రధానమా?
కరోనా రెండో దశ విజృంభణ వేళ.. పడకల కొరత వేధిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు బదులు ఆరోగ్య వసతుల నిర్మాణంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేదని ఆమె నిలదీశారు.
"జనవరిలో కరోనాపై పోరులో గెలిచామని ప్రధాన మంత్రి తప్పుడు ప్రకటనలు చేశారు. దేశంలో ఆక్సిజన్ పడకలు 36శాతం, ఐసీయూ పడకలు 46శాతం, వెంటిలేటర్ పడకలు 28శాతం తగ్గిపోయాయి. ఆరోగ్య వసతులను పెంపొందించాలని నిపుణులు చెప్పిన సూచనలను ఆయన(మోదీ) పెడచెవినపెట్టారు."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
ఆరోగ్యానికి సంబంధించి పార్లమెంటరీ కమిటీలోని నిపుణులు చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రియాంక విమర్శించారు. ప్రతి జిల్లాలో ఆరోగ్య వసతులను మెరుగుపరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. '2014 నుంచి ఒక్క కొత్త ఎయిమ్స్‌ను కూడా ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. కానీ, సెంట్రల్ విస్టా ప్రాజెక్టును మాత్రం వేగవంతగా నిర్మించేందుకు చూస్తున్నారు. ప్రజలకు ఆస్పత్రుల్లో పడకలు కల్పించటం కంటే సెంట్రల్ విస్టానే ప్రధానమా?' అని ప్రియాంక ప్రశ్నించారు.
ఇదీ చూడండి: 'భాజపాతో పొత్తా..? సమస్యే లేదు'
ఇదీ చూడండి: దీదీ మేనల్లుడికి పార్టీలో కీలక బాధ్యతలు!