భారత్‌ను విమాన నిర్వహణ, మరమ్మతు(ఎంఆర్‌వో) కేంద్రంగా మార్చేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి(Civil Aviation Minister) జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) తెలిపారు. బేగంపేట, తిరుపతి, భోపాల్, చెన్నై, దిల్లీ, ముంబయిలోని జుహూ, కోల్‌కతా విమానాశ్రయాలను ఎంఆర్‌వో కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దిల్లీలో విలేకరుల సమావేశంలో సింధియా మాట్లాడారు. తన వంద రోజుల కార్యాచరణను ప్రకటించారు.
"ఇంజిన్, విమాన సర్వీసింగ్ అంతా విదేశాల్లోనే జరుగుతోంది. ఈ వ్యాపారాన్ని భారత్‌లో విస్తరించాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. ప్రస్తుతం భారత్‌లో 710 విమానాలు ఉన్నాయి. వాటి సర్వీసింగు అంతా పై కేంద్రాల్లో జరిగేలా చూడటమే మా లక్ష్యం. మిలటరీ, పౌరవిమాన సర్వీసింగ్ అంతా ఈ ఎంఆర్‌వో కేంద్రాల్లోనే నిర్వహించేలా రక్షణశాఖను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఉడాన్ స్కీంలో (Udaan Scheme)కొత్తగా 50 మార్గాలు చేరుస్తున్నాం. ఇందులో 30 అక్టోబరులో.. మిగిలిన 20 నవంబరుకల్లా ప్రారంభిస్తాం. సెప్టెంబరు చివరికల్లా ఎయిర్‌సేవ 3.0 పోర్టల్‌ను ఏర్పాటు చేస్తాం. దీనివల్ల పెండింగులో ఉన్న ఫిర్యాదుల వివరాలు పౌరవిమానయానశాఖ వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి."
-జ్యోతిరాదిత్య సింధియా, పౌరవిమానయాన శాఖ మంత్రి
విమాన ఛార్జీల రీఫండ్ బాధ్యతను కేవలం టికెట్ ఏజెన్సీలకే పరిమితం చేయకుండా విమానయానసంస్థకూ అప్పగిస్తున్నామని సింధియా తెలిపారు. ప్రతి టికెట్‌పై ఎయిర్‌సేవ క్యూఆర్ కోడ్ ఉంటుందని, ఫిర్యాదు చేయాలనుకున్నవారు దాన్ని స్కాన్ చేసి అక్కడికక్కడే ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.
ఇదీ చూడండి: హైవేపై మంత్రుల విమానం ల్యాండింగ్ సక్సెస్