అనగనగా ఒక బడి.. కానీ అక్కడ ఎలాంటి అల్లరీ వినిపించదు.. ఎలాంటి సందడి ఉండదు. విద్యార్థుల కేకలు.. టీచర్ల అరుపులు ఏమీ ఉండవు. పిల్లల ఆటలూ కనిపించవు. ఎందుకంటే అక్కడ ఉండేది ఒకే ఒక్క విద్యార్థి.. అతడికి పాఠాలు చెప్పేది ఒకే టీచర్. మహారాష్ట్రలోని వాశిమ్ జిల్లా గణేశ్పుర్లో ఒకే విద్యార్థి కోసం పాఠశాల నడుపుతున్నారు.
ఒకప్పుడు పిల్లలతో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలతో కళకళలాడుతుండేవి. ప్రైవేటు బడుల రాకతో సర్కారు పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ, గణేశ్పుర్లో ఒకే ఒక్క విద్యార్థి కోసం పాఠశాలను నడుపుతున్నారు. ఆ విద్యార్థికి పాఠాలు చెప్పడానికి.. ఓ టీచర్ ప్రతిరోజు 12 కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నారు. ఒకే విద్యార్థి ఉన్నా.. రోజూ చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు ఉపాధ్యాయుడు కిశోర్ మన్కర్. అందుకు తగ్గట్టే ఈ బడికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెబుతున్నారు కిశోర్ మన్కర్.
"మా గ్రామంలో 150 మంది నివసిస్తున్నారు. రెండేళ్ల నుంచి ఈ పాఠశాలలో ఒకే విద్యార్థి ఉన్నాడు. రెండేళ్ల నుంచి నేను ఒక్కడినే ఉపాధ్యాయుడిని. ఒక్కడినే ఆ విద్యార్థికి చదువు చెబుతున్నాను. జాతీయ గీతాలాపన లాంటి నియమ నిబంధనలను పాటిస్తాము. మధ్యాహ్న భోజనం లాంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. వాటిని ఆ విద్యార్థికి అందించడానికి ప్రయత్నిస్తాము. విద్యార్థికి అన్ని సబ్జెక్టులు చెప్పడం, చదవడం, రాయడం లాంటివి ప్రతిరోజు చెప్పేందుకు ప్రయత్నిస్తాము."
-కిశోర్ మన్కర్, ఉపాధ్యాయుడు
ఒకే విద్యార్థి ఉన్నా అతడికి చదువు చెప్పడంలో రాజీపడటం లేదని కిషోర్ మన్కర్ చెబుతున్నారు. ప్రతిరోజు ఆ విద్యార్థికి అన్ని సబ్జెక్టులు, చదవడం రాయడం నేర్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
ఇవీ ఒకే విద్యార్థి కథలే..
ఈ తరహా పాఠశాలలు ఇంతకుముందు కూడా వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో.. పదో తరగతి చదువుతున్న విద్యార్థికి ఐదుగురు అధ్యాపకులు బోధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇలాంటి ఘటన మరొకటి ఆదిలాబాద్లో జరిగింది. ఝరి అనే గ్రామ ప్రథమిక పాఠశాలలో ఒకే విద్యార్థిని ఉండేది. ఆ బాలికను రోజు ఉపాధ్యాయురాలు పాఠశాలకు తీసుకువచ్చి పాఠాలు చెప్పేవారు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.