Winter Session 2021: శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ(Pm modi news) ప్రసంగించారు. పార్లమెంట్లో ఇదొక ముఖ్యమైన సెషన్ అని అన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరపాలని ప్రజలు కోరుకుంటున్నారని, అలాంటి చర్చలే దేశాభివృద్ధికి బాటలు వేస్తాయని తెలిపారు.
" ఈ శీతాకాల సమావేశంలో అన్ని సమస్యలనూ చర్చించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం పార్లమెంట్లో డిబేట్ నిర్వహించాలి. దీంతోపాటు సభామర్యాదనూ కాపాడాలి. ఇదో ముఖ్యమైన పార్లమెంటరీ సెషన్. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరపాలని ప్రజలు కోరుకుంటున్నారు."
-- ప్రధాని నరేంద్ర మోదీ
సీనియర్ కేబినెట్ మంత్రులతో భేటీ..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు సీనియర్ కేబినెట్ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్రహోం మంత్రి అమిత్షా, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్యశాఖ మంత్రి పీయుష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంతి ప్రహ్లాద్ జోషీ.. పాల్గొన్నారు.
మార్చి వరకు ఉచిత రేషన్..
దేశంలోని పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే 'ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన' పథకాన్ని 2022 మార్చి వరకు పొడిగించినట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ నిర్ణయంతో 80కోట్లమంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
కొవిడ్-19 కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఇప్పటికే 100 కోట్ల టీకా డోసులు అందించామని, 150 కోట్ల డోసులు అందించే దిశగా.. ముందుకెళ్తున్నామన్నారు.
పార్లమెంట్లో అన్ని సమస్యలపైనా చర్చించేందుకు, వాటికి సమాధానాలు చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు మోదీ. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 23 వరకు జరగనున్నాయి.
ఇదీ చూడండి: ఎన్నికల వేళ శీతాకాల సమావేశాలు.. పైచేయి ఎవరిదో?