కరోనాతో ప్రభావితమైన చిన్నారుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు, పోలీసులు, పంచాయతీ రాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్‌లకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రామ్ మోహన్ మిశ్రా లేఖ రాశారు.
వైరస్ వల్ల ప్రభావితమైన చిన్నారులను సర్వేల ద్వారా గుర్తించాలని సూచించింది కేంద్రం. ప్రతి ఒక్క చిన్నారి వివరాలతో కూడిన డేటాబేస్‌ను తయారు చేయాలని ఆదేశించింది. డేటాను ట్రాక్ చైల్డ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించింది.
ప్రస్తుతం కరోనా బారిన పడ్డ తల్లితండ్రుల పిల్లలను సంరక్షించేందుకు బంధువులు లేకపోతే.. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్(సీసీఐ)లలో వారికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించాలని సూచించింది. తమకు నమ్మకస్తులైన వారి వివరాలను కరోనా బాధితుల నుంచి ముందుగానే సేకరించేలా ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపింది. అనుకోని పరిస్థితులు ఎదురైతే.. ఈ సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొంది.
మరిన్ని మార్గదర్శకాలు..
- ప్రస్తుతం ఉన్న చైల్డ్ కేర్ సదుపాయాలను చిన్నారుల పునరావాసం కోసం తాత్కాలికంగా ఉపయోగించుకోవాలి.
- కొవిడ్‌తో బాధపడుతున్న చిన్నారులను సంరక్షించేందుకు సీసీఐలలో ప్రత్యేక ఐసోలేషన్ సౌకర్యాలను రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి.
- పిల్లలలో మానసిక రుగ్మతలు తలెత్తకుండా ఉండేలా.. వారితో సంభాషించేందుకు కౌన్సిలర్లను, సైకాలజిస్టులను తరచుగా ఈ కేంద్రాలకు పంపాలి. ఇందుకోసం ఓ రోస్టర్‌ను తయారు చేయాలి.
- మానసిక బాధలో ఉన్న చిన్నారులకు సహాయం చేసేందుకు హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలి. నిపుణుల ద్వారా వారికి సూచనలు అందించాలి.
జిల్లా యంత్రాంగాలకు...
- కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన చిన్నారులకు జిల్లా మేజిస్ట్రేట్లు సంరక్షకులుగా వ్యవహరించాలి. అలాంటి చిన్నారుల అవసరాలను గుర్తించి, వాటిని అందేలా చూసేందుకు జిల్లా స్థాయిలో బహుళ శాఖల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి.
- కుటుంబ, పూర్వీకుల ఆస్తులపై చిన్నారులకు ఉన్న హక్కులను జిల్లా మేజిస్ట్రేట్లు పరిరక్షించాలి. ఆ ఆస్తులు అమ్మకం, ఆక్రమణకు గురికావడం వంటివి జరగకుండా చూడాలి.
పోలీసులకు..
- చిన్నారుల అక్రమ రవాణా జరగకుండా జిల్లా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలి.
- బాల్య వివాహాలు, అక్రమంగా దత్తత తీసుకోవడం వంటివి జరగకుండా పర్యవేక్షించాలి.
- చిన్నారుల దత్తత కోసం సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను గుర్తించాలి. నిందితులపై చర్యలు తీసుకోవాలి.
- పట్టణాలు, గ్రామాల్లో పోలీసులు పర్యవేక్షణ(పోలీస్ బీట్లు, నైట్ రౌండ్లు) చేపట్టే సమయంలో సీసీఐ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిసారించాలి.
స్థానిక సంస్థలకు
పంచాయతీ రాజ్ సంస్థలు బాధిత చిన్నారులను గుర్తించి జిల్లా అధికారులకు లేదా చిన్నారుల సంరక్షణ కేంద్రాలకు సమాచారం అందించాలి.
దీంతో పాటు.. కరోనా కారణంగా అనాథలైన చిన్నారులకు ప్రభుత్వ సాధారణ లేదా రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచితంగా విద్య అందించాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. అర్హత ఆధారంగా కేంద్ర, రాష్ట్ర స్కాలర్షిప్ పథకాల్లో చిన్నారుల పేర్లను నమోదు చేయాలని సూచించింది. చిన్నారులు కోరుకుంటే.. దగ్గర్లోని ప్రైవేటు పాఠశాలల్లోనూ చేరవచ్చని పేర్కొంది.
జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ వివరాల ప్రకారం కరోనా వల్ల దేశవ్యాప్తంగా 9,346 మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల్లో కనీసం ఒకరిని కోల్పోయారు. 1,882 మందికి పైగా చిన్నారులు ఇద్దరినీ పోగొట్టుకొని అనాథలుగా మారారు.
ఇదీ చదవండి- బాలలపై కేంద్రానికి ఎంత దయో!