రైతులను కేంద్రంలోని భాజపా సర్కారు అవమానపరుస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియంక గాంధీ వాద్రా. సాగు చట్టాలకు వ్యతిరేక నిరసనల్లో మరణించిన రైతుల సమాచారం లేదని కేంద్రం చెప్పడంపై ఆమె మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఆదివారం మరోసారి డిమాండ్ చేశారు.
"సాగు చట్టాల గురించి రైతులు ఏమనుకుంటున్నారో తెలసుకునే ప్రయత్నం చేయలేదని కేంద్రమే పార్లమెంట్లో తెలిపింది. ఎంతమంది రైతులు అమరులయ్యారో కూడా తమకు తెలియదని చెప్పింది. ఈ అంశాన్ని కేంద్రం తన సంపన్న మిత్రుల దృష్టి నుంచి చూస్తోంది. నిరంతరం రైతులను అవహేళన చేస్తోంది."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
ఈ మేరకు హిందీలో ట్వీట్ చేసిన ప్రియాంక.. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.
దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనల్లో చనిపోయిన రైతుల వివరాలు తమ వద్ద లేవని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ పార్లమెంటుకు శుక్రవారం తెలిపారు.
ఆగని నిరసనలు..
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని రైతులు గతేడాది నవంబర్ నుంచి నిరసనలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'కేంద్ర సాగు చట్టాలు విలువ కోల్పోయాయి'