'ప్రపంచంలో నిశ్చయమైనవి రెండే- పన్నులు, మరణం' అన్నది ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజిమిన్ ఫ్రాంక్లిన్ వ్యంగ్య వ్యాఖ్య! అటువంటి సుంకాల సంకెళ్లలోంచి సైతం చులాగ్గా తప్పించుకోగలగడం ఘరానా పెద్దమనుషులు ఎందరికో వెన్నతో పెట్టిన విద్య! పనామా, పండోరా పత్రాల సాక్షిగా ఆ విషయంలో వారి తెలివితేటలకు తిరుగు లేదు.. ఆ అక్రమాలకు ఏ అడ్డూ ఉండదు! నిబంధనలను నీటిపై రాతలుగా మార్చేయడంలో కాకలుతీరిన ఆ బడాబాబులతో పోలిస్తే- ప్రభుత్వాల పన్నుల ప్రతాపమంతా సామాన్యులపైనే అన్నది నిర్వివాదాంశం. జీవితానికి భద్రతనిచ్చే ఆరోగ్య బీమా పాలసీలనూ వదిలిపెట్టకుండా, ప్రీమియాలపై 18శాతం జీఎస్‌టీని(Gst on health insurance) వడ్డిస్తున్న సర్కారీ విధానమే అందుకు నిదర్శనం. తలకు మించిన వైద్య వ్యయభారాలతో జనసామాన్యం చితికిపోతున్న కరోనా కాలంలోనూ కర్కశ శుల్కాలతో కాసుల(Gst on health insurance) పండగ చేసుకుంటున్న ఏలినవారి గొప్పతనాన్ని వర్ణించడం.. ఎంతటి వారికైనా అసాధ్యమే!
ఒకే గాటన కట్టేయడం..
సామాజిక భద్రత కరవైన దేశంలో బీమా ప్రీమియాలపై 18శాతం(Gst on health insurance) సుంకం దారుణమని 'ఇర్డాయ్' (బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ) మాజీ సభ్యులు నీలేష్ సాథే తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఛైర్మన్ ఎం.ఆర్.కుమార్‌తో పాటు బజాజ్ అలయన్స్ ఎండీ, సీఈఓ తపన్ సింఘేల్ సైతం దీనిపై గళమెత్తారు. పోనుపోను పెచ్చరిల్లుతున్న వైద్య ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోకుండా, పన్నుల రూపేణా సామాన్యుల భుజాలపై మరింత భారం మోపడం సమంజసం కాదని హితవు పలికారు. ఇదే విషయాన్ని(Health insurance gst rate 2021) ఇర్డాయ్ కూడా ఒకటికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. బీమా కిస్తులపై జీఎస్‌టీని అయిదు శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. బీమా ఏజెంట్ల సంఘాల జాతీయ సమాఖ్య అయితే దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు జీఎస్‌టీ మండలి, పార్లమెంటరీ స్థాయీసంఘాలకు వినతి పత్రాలూ సమర్పించింది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు తీసుకునే పెద్ద పాలసీలను; వ్యక్తిగత స్థాయిలో అక్కరకొచ్చే ఆరోగ్య, ప్రమాద బీమా పాలసీలను ఒకే గాటన కట్టేయడం అన్యాయమని నివేదించింది. పన్ను విధింపుల్లో వాటి మధ్య విభజన ఉండి తీరాలన్న సమాఖ్య వాదన సహేతుకమే! అయినా ఆలకించే వారెవరు? బీమా రంగ ప్రముఖుల నుంచి క్షేత్రస్థాయి ఏజెంట్ల వరకు అందరి విజ్ఞాపనలూ బుట్టదాఖలవుతున్న దుస్థితిలో- పాలసీదారుల వెన్నువిరిచే పన్నులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విధానాలకు జనశ్రేయమే కేంద్రబిందువు కావాలన్న ప్రధాని మోదీ సదాశయ స్ఫూర్తికి అవి నిలువునా తూట్లు పొడుస్తున్నాయి.
కాసుపత్రులుగా అవతరించి..
ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు. వైద్యచికిత్సల వ్యయం అందరికీ అందుబాటులో ఉండటం అందులో అంతర్భాగమని సుప్రీంకోర్టు లోగడే స్పష్టీకరించింది. కానీ, సర్కారీ దవాఖానాల్లో దశాబ్దాలుగా మేటవేసిన సమస్యలు జనసామాన్యాన్ని ప్రైవేటు ఆసుపత్రుల వైపు తరుముతున్నాయి. ఆ వైద్యశాలల్లో అత్యధికం కాసుపత్రులుగా అవతరించి సామాన్యులను చెండుకుతింటున్నాయి. బడ్జెట్ కేటాయింపులను బిగపడుతూ ప్రభుత్వ వైద్యాన్ని గుల్లబార్చిన పాలకుల పాపం- 64శాతం వైద్య ఖర్చులను (ప్రపంచ సగటు 18.2శాతం) భారతీయులు సొంతంగా భరించాల్సిన దురవస్థను కల్పించింది. మరోవైపు గడచిన దశాబ్ద కాలంలో ప్రైవేటు వైద్యవ్యయ భారం 175శాతానికి పైగా పెరిగింది. అప్పులు చేసి ఆరోగ్యాన్ని కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యపూరిత వాతావరణంలో దేశవ్యాప్తంగా ఏటా ఆరు కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలోకి జారిపోతున్నారు. భారత జనాభాలో ముప్ఫై శాతానికి ఎటువంటి ఆరోగ్య బీమా రక్షణా లేదని నీతిఆయోగ్ తాజా నివేదిక తేటతెల్లం చేసింది. వ్యవసాయంపై ఆధారపడిన వారు, గ్రామాల్లోని అసంఘటిత రంగ కార్మికులు, పట్టణాల్లో చిన్నాచితకా వృత్తుల్లోని 40 కోట్ల మందికి బీమా ధీమా కల్పించాలంటే- కిస్తులు అందరికీ అందుబాటులో ఉండాలని సూచించింది. సర్కారీ సుంకాల సుడిగుండంలోంచి బీమా పాలసీలు బయటపడితేనే- సార్వత్రిక స్వాస్థ్య రక్షణకు బాటలు పడతాయి.
జనం జేబులకు చిల్లి పెట్టాల్సిందే..
అయిదేళ్ల క్రితం జీఎస్‌టీని పట్టాలెక్కించిన తరుణంలో- సులభమైన సరళతరమైన పన్ను విధానమంటూ దానిపై ప్రభుత్వ ప్రకటనలు మోతెక్కిపోయాయి. ఆ మాటల్లోని నిజానిజాలు ఏపాటివో అది అమలులోకి వచ్చాక కానీ, తెలియలేదు! ఇనుప గుగ్గిళ్ల వంటి జీఎస్‌టీ నిబంధనల ప్రత్యేకతను అర్థం చేసుకోవాలంటే నిరుడు కర్ణాటక, ఇటీవల గుజరాత్ ఏఏఆర్‌లు (అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్) ఇచ్చిన ఆదేశాలను పరిశీలించాలి. 'రెడీ టూ ఈట్' పదార్థాల్లో చపాతీకి అయిదు శాతం జీఎస్‌టీ వర్తిస్తే, పరోటాకు 18శాతం పన్ను(Gst on health insurance) కట్టాల్సి ఉంటుందని అవి తేల్చాయి. ఎందుకీ తేడా అంటే- చపాతీని నేరుగా తినవచ్చు కానీ, పరోటాను ఆరగించాలంటే ఇంకోసారి వేడి చేసుకోవాల్సి వస్తుందన్నది ఆ ఏఏఆర్ పెద్దల సమాధానం! ఖజానా కళకళలాడాలంటే జనం జేబులకు చిల్లి పెట్టాల్సిందే. దృష్టంతా దానిపైనే ఉన్నప్పుడు ఇటువంటి చిత్ర విచిత్ర తర్కాలు, నిబంధనలు పురుడు పోసుకోవడం సహజాతి సహజం! కొవిడ్ చికిత్సలో అతికీలకమైన ఔషధాలు, ఉపకరణాలపై జీఎస్‌టీ సబబు కాదన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి సైతం కుడిఎడమగా ఇలాగే వాదించారు. పన్ను తొలగించినంత మాత్రాన వాటి ధరలు దిగిరావని ఆవిడ అప్పట్లో కుండ బద్దలుకొట్టారు. పైపెచ్చు ఆపత్కాలంలో ప్రజలను పన్నుపోట్లకు గురిచేసి ఖజానాను నింపే ఆలోచనేదీ తమకు లేదని నమ్మబలికారు. మొత్తానికి ఆ తరవాత ఆ సుంకాల పీడనను తప్పించారు కానీ, అప్పటికి పుణ్యకాలం గడచిపోయింది! కొన్నింటి మీద వద్దన్నా జీఎస్‌టీని రుద్దుతున్న పాలకులు- పెట్రోలు, డీజిలును ఆ పన్ను పరిధిలోకి తెమ్మన్నా తీసుకురావడం లేదు. ఆ రెండింటిపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం ఇటీవల కొద్ది మేరకు తగ్గించినా- కొండెక్కిన ధరలతో పోలిస్తే సామాన్యులకు దక్కిన ఊరట చాలా స్వల్పమే!
పటిష్ఠం చేస్తేనే..
సార్వత్రిక ఆరోగ్య పథకాలతో చైనా, జర్మనీ, ఇటలీ, గ్రీస్ తదితర దేశాలు తమ ప్రజలను కాచుకుంటున్నాయి. అమెరికా, స్వీడన్, జపాన్ వంటివి ప్రజారోగ్యంపై సమధిక నిధులను వెచ్చిస్తున్నాయి. జాతీయ ఆరోగ్య వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దిన యూకే ప్రభుత్వం- దేశీయులందరికీ ఏకరూప వైద్యసేవలు అందించడానికి కృషిచేస్తోంది. అటువంటి మేలిమి ఆచరణలకు నోచుకోని ఇండియాలో పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యం అంతకంతకూ అందని ద్రాక్షే అవుతోంది. బీమా పాలసీలపై పన్నులను హేతుబద్ధీకరించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్ఠం చేస్తేనే సామాన్యుల ఆరోగ్యానికి భద్రత ఒనగూడుతుంది. ఆ కర్తవ్యదీక్షకు ఏలినవారు కంకణ బద్ధులవుతారంటారా?
- శైలేష్ నిమ్మగడ్డ
ఇవీ చూడండి: