Golu 2 Buffalo Eating Dry Fruits : బిహార్‌కు చెందిన ఓ దున్నపోతు రాజభోగాలు అనుభవిస్తోంది. రోజూ 35 కిలోల పచ్చి, ఎండు గడ్డి మేయడమే కాకుండా డ్రైఫ్రూట్స్ తింటోంది. ఏడెనిమిది కిలోల బెల్లం సునాయాసంగా తినేస్తోంది. వీటిలో పాటు వెయ్యి, పాలు గటగటా తాగేస్తోంది. అలా దీని తిండి కోసం నెలకు రూ.30-35 వేల వరకు ఖర్చు అవుతోంది. అయితే ఈ దున్నపోతు యజమాని ఎందుకు ఇంతమొత్తంలో ఖర్చు పెడుతున్నాడో తెలుసుకుందాం.
ఈ దున్నపోతు ప్రత్యేకతలివే!
బిహార్‌లోని పట్నాలో జరిగిన పశువుల ప్రదర్శనలో గోలు-2 అనే దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆరేళ్ల ఈ వయసున్న గోలు 15 క్వింటాళ్ల బరువు, 3 అడుగుల వెడల్పు ఉంది. ఈ దున్నరాజం అనేకసార్లు జాతీయ పతకాలను కూడా గెలుచుకుంది. ముర్రా జాతికి చెందిన ఈ దున్న వీర్యానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దాదాపు రూ.10 కోట్ల విలువైన ఈ గోలు-2ను పట్నాలో జరిగిన జంతు ప్రదర్శనకు తీసుకొచ్చారు. దీంతో దున్న అందిరీ దృష్టిని ఆకర్షించింది. జనం ఈ దున్నను చూడటానికి బారులు తీరారు.
"పశువుల పెంపకందారుల కోసం మేము ఈ దున్నను హరియాణాలోని పానీపత్ నుంచి తీసుకువచ్చాము. పశుపోషకులు దీని ప్రత్యేకతను అర్థం చేసుకోవాలి. బిహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు పశువుల పెంపకందారులకు చూపించడానికి మేము దానిని ఈ ప్రదర్శనకు తీసుకువచ్చాము. ఈ దున్న వీర్యానికి భిన్నమైన ప్రత్యేకత ఉంది. అందుకే దీని ధర ఎక్కువగా ఉంది"
-- అజిత్, పశువుల పెంపకందారు
30 వేల మంది పిల్లలు!
సాధారణ గేదెలతో బ్రీడింగ్ చేసినా దానికి పుట్టే పిల్లల జాతి కూడా మారిపోతుందని దున్నపోతు యజమాని ప్రవీణ్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ దున్నకు 30 వేల మందికి పైగా పిల్లలు ఉన్నారని అన్నారు. అయితే ఇంతకుముందు గోలు అనే దున్నపోతు ఉండేదని అది చనిపోయిన తర్వాత దీనికి గోలు-2 పేరు పెట్టినట్లు తెలిపారు. దీన్ని ముద్దుగా వాటర్ ట్యాంకర్ అని కూడా పిలుస్తారట.