Goa political couple: మినీ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సత్తా చాటింది. అయితేస, గోవాలో మేజిక్ ఫిగర్‌కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన భాజపా.. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అదే రాష్ట్రంలో భాజపా తరపున పోటీ చేసిన రెండు జంటలు.. విజయ బావుట ఎగరవేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా, కాంగ్రెస్ నుంచి బరిలోకి భార్యాభర్తలిద్దరు కూడా విజయం సొంతం చేసుకున్నారు.
వాల్పోయి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన గోవా ఆరోగ్య మంత్రి, భాజపా నేత విశ్వజిత్ రాణే.. తన ప్రత్యర్థిపై 8,085 ఓట్ల తేడాతో గెలుపొందగా.. పోరియం స్థానం నుంచి పోటీ చేసిన ఆయన భార్య దేవియ విశ్వజిత్ రాణే.. తన సమీప ప్రత్యర్థిపై 13,943 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
భాజపా తరపున పోటీ చేసిన మరో జంట కూడా ఇదే విధంగా విజయాన్ని దక్కించుకుంది. పనాజీ నుంచి పోటీ చేసిన అతానాసియో మోన్‌సెరాట్ గెలుపొందగా.. తాలిగావ్ స్థానం నుంచి ఆయన భార్య జెనిఫర్ మోన్‌సెరాట్ విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి మైఖేల్ విన్సెంట్ లోబో కలంగుట్ స్థానం నుంచి గెలుపొందగా.. ఆయన భార్య డెలిలా మైఖేల్ లోబో సియోలిమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
డిప్యూటీ సీఎం ఓటమి
గోవాలో భాజపా ఘన విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఈ ఎన్నికల్లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు తమ సమీప కాంగ్రెస్ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు. మార్గోవ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అభ్యర్థి దిగంబర్ కామత్ దాదాపు 6,000 ఓట్ల తేడాతో ఉప ముఖ్యమంత్రి మనోహర్ అజ్గాంకర్ను ఓడించారు.
మరో ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్.. క్యూపెమ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్టోన్ డికోస్టా చేతిలో సుమారు 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇదీ చూడండి: ఉత్తరాఖండ్‌లో భాజపా నయా చరిత్ర.. మోదీ మేజిక్ రిపీట్!