Goa Elections 2022: మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడీ సర్కారు పాలన సాగిస్తోంది. అయితే అదే కూటమి నమూనాతో గోవా ఎన్నికల్లో ముందుకెళ్లాలని అనుకున్న శివసేనకు ఆదిలోనే ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ నుంచి ఆశించిన రీతిలో స్పందన రాకపోవడం వల్ల ఎన్సీపీతో జత కట్టి.. గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గోవాలో శివసేన 10 నుంచి 15 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. దీనిపై చర్చించేందుకు ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి జితేంద్ర, ఎన్సీపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రఫుల్ పటేల్ రెండు రోజుల్లో గోవాకు వస్తారని సమాచారం. ఆ సమయంలోనే పొత్తుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
అసలేం జరిగింది?
ఎన్నికల్లో పొత్తు విషయమై శివసేన- కాంగ్రెస్ మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. అయితే భాజపా బలంగా ఉండే స్థానాలను శివసేనకు కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో శివసేన.. కాంగ్రెస్‌తో పొత్తుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ తరహాలో గోవా సర్కారును ఏర్పాటు చేయాలంటే.. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని ఈ సందర్భంగా శివసేన అడగ్గా.. అందుకు కాంగ్రెస్ నిరాకరించిందనే వాదన వినిపిస్తోంది. అందుకే శివసేన నేతలు కాంగ్రెస్ పట్ల బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శివసేన ఎంపీ, ఆ పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ సంజయ్ రౌత్ ఇటీవల గోవా వచ్చిన సందర్భంలో కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అందుకు ఓ ఉదాహరణ.
ఎన్సీపీతో పొత్తుపై శివసేన నేతలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. గోవా ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేసే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు గోవా శివసేన చీఫ్ జితేశ్ కామత్.
"సమయం వచ్చినప్పుడు.. మేం ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంటాం. దీనిపై చర్చలు జరుగుతున్నాయి."
--జితేశ్ కామత్, గోవా శివసేన చీఫ్
ఇదిలా ఉంటే గోవాలో ప్రధాన, బలమైన పోటీదారైన భాజపా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆశావహులు భారీగా ఉండటం వల్ల జాబితాను ఆలస్యంగా ప్రకటించి.. ఈ లోపు రెబల్స్‌ను బుజ్జగించాలనే యోచనలో భాజపా నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చడవండి: గోవా రణక్షేత్రంలో దీదీ పోరు- గెలిచి నిలిచేనా?