Goa chief minister: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన భాజపా వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రమోద్ సావంత్.. మరోమారు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. పనాజీలో సోమవారం నిర్వహించిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భాజపా కేంద్ర పరిశీలకులు నరేంద్ర సింగ్ తోమర్, ఎల్ మురుగన్ సహా గోవా ఎన్నికల ఇంఛార్జి దేవేంద్ర ఫడణవీస్, సీటీ రవి, తనవేడ్ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేదానిపై సందిగ్ధం ఏర్పడింది. ఫలితాలు వెలువడిన 11 రోజుల తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటించటం గమనార్హం. మొదటి నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గు చేపేలా కనిపించినా.. పార్టీలో కాస్త వ్యతిరేకత రావటం వల్ల ఈ జాప్యం జరిగినట్లు ఊహాగానాలు వచ్చాయి. భాజపా ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విశ్వజిత్ రాణె, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పేర్లు ప్రధానంగా వినిపించాయి.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లు సాధించింది భాజపా. ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారం!
గోవా ముఖ్యమంత్రిగా... ప్రమాణ స్వీకారం మార్చి 23 నుంచి 25వ తేదీల మధ్య ఉండనుందని సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా సీనియర్ నేతలు హాజరవుతున్నట్లు గోవా భాజపా అధ్యక్షుడు సదానంద్ షేత్ తనవేడ్ తెలిపారు.
ఇదీ చూడండి: