ఉత్తరాఖండ్లో మంచు చరియలు విరిగిపడి సంభవించిన జలవిలయం కారణంగా మరణించిన వారి సంఖ్య 20కి పెరిగింది. ఇంకా 197 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. పవర్ ప్రాజెక్టులోని సొరంగాలలో చిక్కుకున్న 30మంది కార్మికులను బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తవ్వేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నందన మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
![Multi-agency operation on to rescue those trapped inside tunnel in Uttarakhand's Tapovan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10548301_img.jpeg)
![Multi-agency operation on to rescue those trapped inside tunnel in Uttarakhand's Tapovan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10548301_img4.jpeg)
ప్రాణ రక్షణే ప్రధానం...
వరదల్లో గల్లంతైన వారి ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వరదల కారణంగా ప్రభావితమైన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది హామీ ఇచ్చారు. ప్రమాదం కారణంగా వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందన్నారు. ఈ ఘోర విపత్తుకు పూర్తి కారణాలను అన్వేషిస్తామని చెప్పారు. అందుకోసం ఇస్రో, డీఆర్‌డీఓ సాయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే డీఆర్‌డీఓ బృందం కారణాలను అన్వేషిస్తోందని, ఇస్రో సాయాన్ని కూడా కోరామని పేర్కొన్నారు.
మంచు చరియలు విరగలేదు..
అందరూ అనుకుంటున్నట్లు హిమనీనదం కట్టలు తెంచుకోవడం వల్ల వరదలు సంభవించలేదని రావత్ వెల్లడించారు. ఈ విషయాన్ని తనకు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారని చెప్పారు. రెండు మూడు రోజులుగా మంచు భారీగా కురిసిందని.. ఒకేసారి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల మంచు నదిలో చేరడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని వివరించారు. మంచు చరియలు కూలినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారని వివరించారు. హిమనీనదం కట్టలు తెంచుకుందని చెబుతున్న ప్రాంతంలో అలాంటి ఘటనలు జరిగే అవకాశం లేదన్నారు.
![Glacier break didn't cause Chamoli disaster: Uttarakhand CM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10545620_isro.jpg)
ముమ్మర గాలింపు..
జలవిలయంలో గల్లంతైన వారికోసం భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. తపోవన్ డ్యామ్ దగ్గర ఉన్న సొరంగంలో ఐటీబీపీ జవాన్లు గాలింపు చేపట్టారు. సొరంగ మార్గంలో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. జలవిద్యుత్‌కేంద్రం వద్దగల సొరంగంలో 100 మీటర్ల వరకు పేరుకుపోయిన బురదను తొలగించినట్లు ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ కుమార్ పాండే తెలిపారు. ఇంకొన్ని గంటలు శ్రమిస్తే మొత్తం 200మీటర్లు పూర్తవుతుందన్నారు. సొరంగంలో చిక్కుకున్న 30మంది కార్మికులను కచ్చితంగా కాపాడతమని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 300మంది ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలో నిమగ్నమైనట్లు చెప్పారు.
![Multi-agency operation on to rescue those trapped inside tunnel in Uttarakhand's Tapovan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10548301_img5.jpeg)
![Multi-agency operation on to rescue those trapped inside tunnel in Uttarakhand's Tapovan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10548301_img3.jpeg)
సహాయక చర్యల్లో వైమానిక దళానికి చెందిన ఎంఐ-17, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు పాల్గొన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ ఛీప్ ఎస్ఎన్ ప్రధాన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
![Multi-agency operation on to rescue those trapped inside tunnel in Uttarakhand's Tapovan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10548301_img2.jpeg)
13 గ్రామాలు..
వరదల కారణంగా జలవిద్యుత్‌ప్రాజెక్టులకు సమీపంలో కొన్ని వంతెనలు కొట్టుకపోగా..13 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అక్కడి ప్రజలకు ఐటీబీపీ సిబ్బంది హెలికాఫ్టర్ల ద్వారా నిత్యావసరాలను సరఫరా చేశారు.