కరోనాను నియంత్రించే ఏ వ్యాక్సిన్‌ను అయినా వినియోగానికి ముందు దాని నమూనాలను పరీక్షించాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. కొవిడ్-19 టీకాను పూర్తిస్థాయిలో పరిశీలించాకే అత్యవసర వాడకానికి అనుమతించాలని శర్మ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు ఓ నివేదిక సమర్పించింది.
ప్రైవేటు ఆస్పత్రులపై పూర్తి స్థాయి నిఘా ఉంచడం సహా.. ఔషధాల బ్లాక్ మార్కెటింగ్‌పై తనిఖీ చేయాలని లేఖలో పేర్కొంది పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ. ఇందుకోసం సమగ్ర ప్రజారోగ్య చట్టాన్ని ఏర్పాటుచేయాలని సూచించింది. మహమ్మారి సమయంలో సమగ్ర ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులే అధిక భాగం సేవలందించాయని నివేదికలో పేర్కొంది. ఫలితంగా ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వాస్పత్రులకు ఎక్కువ నిధులు కేటాయించాలని సూచించింది. తద్వారా రానున్నకాలంలో ఇలాంటి వైరస్‌లను నియంత్రించేందుకు తగిన విధంగా సన్నద్ధం కావొచ్చని స్పష్టం చేసింది.
టీకా వినియోగానికి దరఖాస్తు
కొవిడ్-19ను అరికట్టడంలో భాగంగా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ఇటీవల మూడు కంపెనీలు ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పించాయి. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను భారత ఔషధ నియంత్రణ మండలి.. ఫైజర్ దరఖాస్తులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) కొవిడ్-19 నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి: కొత్త రకం కరోనాపై ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు