కేంద్ర ప్రభుత్వ అలసత్వం, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసంగాల వల్ల ఎలాంటి లాభం లేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పరోక్షంగా విమర్శలు సంధించిన ఆయన.. ఈ సంక్షోభానికి పరిష్కారం చూపాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.
"నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. దేశం నలుమూలల నుంచి బాధాకరమైన వార్తలు నిరంతరం వినాల్సి వస్తోంది. ఈ సంకట పరిస్థితులకు కారణం కరోనా ఒక్కటే కాదు.. కేంద్ర సర్కారు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా. పనికిరాని ఉత్సవాలు (మోదీ పిలుపునిచ్చిన టీకా ఉత్సవ్‌ను ఉద్దేశించి), పస లేని ప్రసంగాలు కాదు.. సంక్షోభానికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఏర్పడింది"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
దేశంలో కొవిడ్ మహమ్మారి విలయం కొనసాగుతున్న వేళ ఈ సోమవారం.. ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని లాక్‌డౌన్ నుంచి మనకు మనమే కాపాడుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ను రాష్ట్రాలు చివరి అస్త్రంగానే ప్రయోగించాలని ప్రధాని సూచించారు. అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉందని, సరిపడా ఆక్సిజన్ సరఫరా కోసం కృషిచేస్తున్నామని, అవసరమైన ప్రతి ఒక్కరికీ ప్రాణవాయువు అందించే దిశగా పనిచేస్తున్నామన్నారు. ఈ ప్రసంగంపైనే రాహుల్ ఇప్పుడు పరోక్ష విమర్శలు చేశారు.
గతవారం.. రాహుల్‌కు కరోనా సోకగా అప్పటి నుంచి ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నారు.
ఇదీ చూడండి: వ్యవస్థతో పాటు మానవత్వాన్నీ అంతం చేసిన కరోనా!