Ghazipur Boat Accident : ఉత్తర్‌ప్రదేశ్ గాజీపుర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అఠ్హఠా గ్రామం సమీపంలో.. వరద బాధితులతో వెళ్తున్న పడవలో ఓ పాము కనిపించింది. దీనితో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు భయంతో నీటిలో దూకారు. ఇదే సమయంలో వారి కుదుపులకు అదుపు తప్పిన పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. మరో 10 మందిని రక్షించారు. ఒక బాలిక కోసం గాలిస్తున్నారు.
బుధవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుకుంటూ వచ్చింది. అఠ్హఠా గ్రామం.. కొన్నిరోజులుగా పడుతున్న వర్షాల కారణంగా ముంపునకు గురైంది. ఆ గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఓ డీజల్ బోటును పంపారు. బోట్ బయలుదేరిన సమయంలో అందులో మొత్తం 17 మంది ఉన్నారు. ఇదే సమయంలో పాము కలకలం సృష్టించగా.. పడవ మునిగిపోయింది.
విషయం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు హుటాహుటిన అక్కడికి వచ్చి 10 మందిని కాపాడారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని ట్రాక్టర్‌పై దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. ఈ క్రమంలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వరద బాధితుల పరిస్థితి తెలుసుకునేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం గాజీపుర్ వచ్చారు. ఆయన తిరుగుపయనమైన గంటల వ్యవధిలోనే ఈ దుర్ఘటన జరిగింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: శిమ్లా వెళ్లి వస్తుండగా లోయలో పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు.. స్వల్ప గాయాలతో..