ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాది ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన గాయత్రి ప్రసాద్ ప్రజాపతిని రేప్ కేసులో దోషిగా తేల్చింది ప్రజాప్రతినిధుల కోర్టు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చింది. వీరందరికీ నవంబర్ 12న శిక్షను ఖరారు చేయనుంది. అదే సమయంలో ఈ కేసులో మరో నలుగురు నిందితులకు ఊరటనిస్తూ.. నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పవన్ కుమార్ రాయ్ తీర్పునిచ్చారు. గాయత్రి ప్రజాపతి, ఆశిష్ శుక్లా, అశోక్ తివారీలపై ఐపీసీ సెక్షన్ 376డీ, 5జీ/6తో పాటు.. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
ఇదీ కేసు..
గాయత్రీ ప్రసాద్ ప్రజాపతి, ఆయన సహచరులు తన కుమార్తెతో బలవంతంగా శారీరక సంబంధాలు పెట్టుకున్నారని, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017 ఫిబ్రవరి 18న సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అనంతరం ఈ కేసు విచారణను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు.
జీవిత ఖైదు లేదా మరణశిక్ష!
ఈ కేసులో గాయత్రి ప్రజాపతి సహా ఇతర నిందితులకు గరిష్ఠ శిక్ష పడే అవకాశం ఉంది. కనీసం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు న్యాయవాదులు పేర్కొన్నారు.
నిర్దోషులుగా విడుదలైన రూపేశ్వర్ అలియాస్ రూపేశ్, చంద్రపాల్, వికాస్ వర్మ, అమరేంద్ర సింగ్ పింటుల తరఫున న్యాయవాది ప్రన్షు అగర్వాల్ వాదనలు వినిపించారు. దర్యాప్తులో భాగంగా వారికి వ్యతిరేకంగా ఆధారాలను సేకరించడంలో అధికారులు విఫలమయ్యారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇవీ చదవండి: